
జూలైలో 1947 కోట్ల లావాదేవీలు
విలువ రూ.25.08 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జూలైలో సరికొత్త రికార్డులకు చేరాయి. 19.47 బిలియన్ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. వీటి విలువ రూ.25.08 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది జూలైలో యూపీఐ లావాదేవీల విలువ రూ.20.64 కోట్లతో పోల్చిచే 20 శాతానికి పైగా పెరిగింది.
ఈ ఏడాది మే నెలలో నమోదైన 18.67 బిలియన్ లావాదేవీలు (విలువ రూ.25.14 లక్షల కోట్లు) ఇంతకుముందు వరకు గరిష్ట రికార్డుగా ఉంది. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలు 85 శాతంగా ఉన్నాయి. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ అందుబాటులోకి రావడం గమనార్హం.
యూపీఐపై కొత్త పరిమితులు
యూపీఐ నెట్‌వర్క్‌పై రద్దీని తగ్గించేందుకు వీలుగా ఎన్‌పీసీఐ కొన్ని పరిమితులను తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాలోఎంత బ్యాలన్స్ ఉందన్నది రోజులో 50 సార్ల వరకే పరిశీలించుకోగలరు. ఇంతకుముందు ఈ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. యూపీఐ లింక్డ్ అకౌంట్లను సైతం 25 సార్లే చూసుకోగలరు. ఒక మొబైల్ నంబర్‌కు లింక్ అయి, 12 నెలలకు పైగా ఇనాక్టివ్‌గా ఉన్న (కార్యకలాపాలు లేని) యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు.