
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన.. ఎంపిక చేసిన వర్గాలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీ పరిమితులను పెంచింది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు ఎక్కువ లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం లభించింది. కొత్త పరిమితులు 2025 సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయి.
యూపీఐ కొత్త పరిమితుల కింద.. వినియోగదారుడు 24 గంటల్లో 10 లక్షల వరకు లావాదేవీలను చేసుకోవచ్చు. ప్రత్యేక ధ్రువీకరణ పొందిన యూజర్లు.. వ్యాపార చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. కాగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి జరిగే లావాదేవీలలో ఎటువంటి మార్పు లేదు (రోజుకు రూ. లక్ష).
యూపీఐ పరిమితులలో కీలక మార్పులు
➤క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులు, బీమా చెల్లింపుల కోసం పరిమితులు రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. అంతే కాకుండా 24 గంటల్లో గరిష్టంగా రూ. 10 లక్షల వరకు అనుమతి లభిస్తుంది.
➤ప్రయాణ రంగంలో.. లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెరిగింది. రోజువారీ పరిమితి రూ. 10 లక్షలు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను ఇప్పుడు ఒకేసారి రూ. 5 లక్షల వరకు చేయవచ్చు. అయితే రోజువారీ పరిమితి రూ. 6 లక్షలకు పరిమితం చేశారు.
➤లోన్, ఈఎమ్ఐ పరిమితులు రూ. 5 లక్షలకు చేరాయి. గరిష్టంగా రోజుకు రూ. 10 లక్షల వరకు లావాదేవీ చేయవచ్చు. ఆభరణాల కొనుగోళ్లు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. రోజువారీ పరిమితి రూ. 6 లక్షలు.
➤బ్యాంకింగ్ సేవలలో, డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ద్వారా టర్మ్ డిపాజిట్‌లను రోజుకు రూ. 5 లక్షల వరకు అనుమతించారు. దీని పరిమితి గతంలో రూ. 2 లక్షలు మాత్రమే.