కరెన్సీ నోటు మీద ట్రంప్‌.. డిజైన్ రెడీ | Trump face 250 dollar bill US treasury design ready for new currency note | Sakshi
Sakshi News home page

కరెన్సీ నోటు మీద ట్రంప్‌.. డిజైన్ రెడీ

May 29 2026 9:35 AM | Updated on May 29 2026 9:58 AM

Trump face 250 dollar bill US treasury design ready for new currency note

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావడానికి సంబంధించిన చర్చ అమెరికా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నోటుకు సంబంధించిన డిజైన్‌ను సిద్ధం చేశామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ వెల్లడించారు. అయితే దీనికి తుది ఆమోదం కాంగ్రెస్‌ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.

వైట్‌హౌస్‌లో మాట్లాడిన బెస్సెంట్‌, “మేము బిల్లు డిజైన్‌ను సిద్ధం చేశాం. అవసరమైతే వెంటనే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి” అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక స్మారక నోటుగా దీనిని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌లో పెండింగ్‌లో బిల్లు

ఈ ప్రతిపాదనకు సంబంధించి రిపబ్లికన్‌ ప్రతినిధి జో విల్సన్‌ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం సజీవ వ్యక్తుల చిత్రాలు అమెరికా కరెన్సీపై ముద్రించరాదు. అయితే ట్రంప్‌ కోసం ఆ నిబంధనకు మినహాయింపు ఇవ్వాలని ఈ బిల్లు కోరుతోంది. ట్రెజరీ విభాగం ప్రకారం, కాంగ్రెస్‌ ఆదేశిస్తే “అమెరికా 250వ వార్షికోత్సవాన్ని ప్రతిబింబించే స్మారక 250 డాలర్ల నోటు” విడుదలకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు.

డిజైన్‌లో ట్రంప్‌ చిత్రం, సంతకం

వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రకారం, ఈ నోటు డిజైన్‌లో ట్రంప్‌ చిత్రపటంతో పాటు 250వ వార్షికోత్సవ లోగో, ఆయన సంతకం కూడా ఉండనున్నాయి. బ్రిటిష్‌ కళాకారుడు ఇయాన్‌ అలెగ్జాండర్‌ ఈ డిజైన్‌ను రూపొందించినట్లు సమాచారం. అమెరికా బ్యూరో ఆఫ్‌ ఎంగ్రేవింగ్‌ అండ్‌ ప్రింటింగ్‌లో ఈ ప్రతిపాదనపై అంతర్గత చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ట్రంప్‌ నియమిత యూఎస్‌ ట్రెజరర్‌ బ్రాండన్‌ బీచ్‌ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌ బ్రాండ్‌ విస్తరణ

2025లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్‌ తన పేరు, చిత్రాన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్‌ చిత్రంతో 250వ వార్షికోత్సవ స్మారక నాణేలు రూపొందించగా, ఫెడరల్‌ భవనాలపై కూడా ఆయన చిత్రపటాలు ప్రదర్శిస్తున్నారు. అయితే 250 డాలర్ల నోటు విడుదల కావాలంటే కాంగ్రెస్‌ బిల్లు ఆమోదం పొందడంతో పాటు ట్రంప్‌ సంతకం కూడా అవసరం. “మేము చట్టానికి కట్టుబడి ఉంటాం. ఇక నిర్ణయం క్యాపిటల్‌ హిల్‌ చేతుల్లోనే ఉంది” అని బెస్సెంట్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement