ముదురుతున్న ఎండలు: కారుని కాపాడుకోడం ఎలా? ఇవిగో సింపుల్ టిప్స్‌ | Sakshi
Sakshi News home page

ముదురుతున్న ఎండలు: కారుని కాపాడుకోడం ఎలా? ఇవిగో సింపుల్ టిప్స్‌

Published Tue, Feb 21 2023 5:19 PM

Tips to protect your car in summer - Sakshi

అసలే రానున్నది ఎండకాలం, వేడి తీవ్రత కేవలం మనుషులు, జంతువుల మీదనే కాదు వాహనాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాంటి సమయంలో వాహనాలను ఎండ బారి నుంచి కాపాడుకోవడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  లేదంటే అనుకోని ప్రమాదాలు  చోటు  చేసుకునే అవకాశం ఉంది. అలాంటి కొన్ని జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నీడలో పార్క చేయడం:
ఎండా కాలం భానుడి భగభగలు తట్టుకోవాలంటే మీ కార్లను నీడగా ఉండే ప్రదేశంలో పార్క్ చేసి ఉంచాలి. ఎండా కాలంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, అలాంటి సమయంలో కారు లోపలి భాగం చాలా తొందరగా వేడెక్కతుంది. కారు లోపలి వేడిని తగ్గించడానికి నీడలోనే పార్క్ చేయాలి. వాహన వినియోగదారులు ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలి.

కారుని వాష్ చేస్తూ ఉండండి:
మీ కారుని సాధారణ సమయంలో కంటే కూడా వేసవి కాలంలో ఎక్కువగా వాష్ చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా కారుని వాష్ చేస్తూ ఉంటే దుమ్ము, ఇతర మలినాలు ఎప్పటికప్పుడు శుభ్రమవుతాయి. ఇది మీ కారు యొక్క జీవిత కాలం పెంచడంలో సహాయపడుతుంది. 

వ్యాక్స్ చేస్తూ ఉండండి:
శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవడానికి అనేక క్రీములు ఉపయోగిస్తారు, అలాగే కారుకి కొన్ని వ్యాక్స్ ఉపయోగించాలి. అవి అల్ట్రా వయొలెట్ కిరణాలను గ్రహించకుండా వెంటనే ప్రతిబింబిస్తుంది. దీని కారణంగా కారు ఎక్కువ వేడిని గ్రహించే అవకాశం లేదు.

సన్‌షేడ్స్ / విండో విజర్ ఉపయోగించండి:
మార్కెట్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్న సన్‌షేడ్‌లను ఎండాకాలంలో ఉపయోగించుకోవచ్చు. అయితే సన్ ఫిల్మ్ ఉపయోగించకూడదు, ఇది చట్టరీత్యా నేరం. కావున ఎండ వేడిని కారు తట్టుకోవడానికి మీరు పార్క్ చేసేటప్పుడు ఈ సన్‌షేడ్ ఉపయోగించుకోవచ్చు, ఇది కారు లోపల ఉండే ప్లాస్టిక్ భాగాలను రక్షించడంలో సహాయపడుతుంది.

యూవీ ప్రొటెక్టివ్ విండో టింట్స్:
వేసవి కాలంలో ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవడానికి యూవీ ప్రొటెక్టివ్ విండో టింట్స్ ఉపయోగించవచ్చు. ఇది మీ కారుని అతి నీలలోహిత కిరణాల నుంచి 99 శాతం రక్షిస్తుంది. మీ కారు విండోస్‌కి మాత్రమే కాకుండా, కారు విండ్‌షీల్డ్‌కి కూడా ఇలాంటి ఉపయోగించవచ్చు.

టైర్ ప్రెజర్ లెవల్స్ చూడండి:
ఎండాకాలంలో కార్ వినియోగదారుడు టైర్ ప్రెజర్ లెవల్స్ తప్పకుండా గమనించాలి. టైరులో తగినంత గాలి లేకపోతే రోడ్డుపైన ఎక్కువ విస్తరిస్తుంది. ఆ సమయంలో టైర్లు అసలే బ్లాక్ కలర్ లో ఉండటం వల్ల ఎక్కువ వేడిని గ్రహించి తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టిప్స్ (చిట్కాలు) పాటించడం వల్ల తప్పకుండా మీ కారుని సూర్యుని తాపం నుంచి కాపాడుకోవచ్చు.

Advertisement
Advertisement