
ఢిల్లీ వంటి మహా నగరాల్లో కాలుష్యం అధికమవడంతో పదిహేనేళ్లు దాటిన కార్లు, ట్యాక్సీలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ తరుణంలో డీజిల్, పెట్రోల్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వీటి విక్రయాలకు అక్కడ ప్రత్యేక మార్కెట్లు ఉంటాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు వ్యాపారులు తక్కువ ధరకు వాటిని అక్కడ కొనుగోలు చేసి సెకండ్ హ్యాండ్ కార్లంటూ విక్రయిస్తున్నారు. వరంగల్ నగరంలో రకరకాల పేర్లతో సుమారు 20 వరకు పాత కార్ల దుకాణాలు ఉన్నాయి. ఏటా సుమారు 1,500 నుంచి 2వేల లోపు కార్లు విక్రయాలు సాగుతున్నాయి. ఇవి కాక తెలిసిన వారు, మధ్యవర్తుల సహకారంతో తెచ్చుకునేవి మరో 1,000 వరకు ఉంటాయని తెలుస్తోంది.
ధ్రువీకరణ పత్రాలు కీలకం..
వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్‌సీ, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు అఫిడవిట్ తీసుకోవాలి. వాహనంపై ఎలాంటి కేసులు లేవని పోలీసు శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ఎన్‌ఓసీ పొందిన 15 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే నెలవారీగా జరిమానా విధిస్తారు. వాహన కాల పరిమితి 15 ఏళ్లు, మోడల్, కంపెనీ(ఇన్వాయిస్) ధరను బట్టి రోడ్ ట్యాక్స్ విధిస్తారు. ఇంజిన్ ఆన్ చేసే సమయంలో ఆయిల్ పైకి ఎగజిమ్మినా లీకైనా, పొగవచ్చినా ప్రమాదమని గుర్తించాలి. గేర్ ఇంజిన్ సరి చూసుకోవాలి. టైర్లు సరిగా లేకపోతే మైలేజీ తగ్గుతుంది.
ఇదీ చదవండి: 1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!
వాహనాన్ని పసిగట్టొచ్చిలా..
వాహన అద్దాల చివర కంపెనీ పేరు, ఏడాది సంఖ్య ముద్రించి లేకపోతే మార్చారని గ్రహించాలి. డోర్ బాటమ్ ప్రాంతంలో రబ్బర్లు తీసి వాటిపై గుండీల ఆకారంలో అచ్చులుంటే ఎలాంటి మార్పు చేయలేదని అర్థం. కాళ్ల కింద డిక్కీ ప్రాంతంలో మ్యాట్‌లు ఎత్తి కింది వైపు దెబ్బతిందో లేదో చూసుకోవాలి. ప్రమాదం జరిగిన వాహనాలకు రంగులు వేసి బఫింగ్ చేస్తే పోల్చుకోవడం కష్టమవుతుంది.