
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రముఖ కంపెనీతో 16.5 బిలియన్ డాలర్ల(రూ.1.4 లక్షల కోట్లు) విలువైన భారీ చిప్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. 2033 చివరి వరకు కొనసాగే ఈ ఒప్పందం శాంసంగ్ చిప్ ఫౌండ్రీ వ్యాపారానికి ఊతమిస్తుందని నమ్ముతుంది. శాంసంగ్ గ్లోబల్ క్లయింట్‌లో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఏ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారో మాత్రం ధ్రువీకరించలేదు. అయితే ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడుతూ శాంసంగ్ టెస్లాతోనే డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పారు. శాంసంగ్ చిప్ ఫౌండ్రీ విభాగం ఇప్పటికే టెస్లాతో కలిసి పనిచేస్తోందని, ఈ కొత్త డీల్ ఆ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.
మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ వల్ల శాంసంగ్ తన తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునేంత ఆర్డర్లను ఆకర్షించలేకపోయింది. మెమొరీ చిప్‌ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న ఈ కంపెనీ చిప్ ఫౌండ్రీ వ్యాపారం డిమాండ్, పోటీని తట్టుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఈ కీలక సమయంలో దీర్ఘకాలిక ఒప్పందం రావడం కంపెనీకి కలిసొస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఓలా కృత్రిమ్‌లో రెండో విడత లేఆఫ్స్
తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ(తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ) ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫౌండ్రీ మార్కెట్లో టీఎస్‌ఎంసీకి 67.6 శాతం వాటా ఉందని పరిశోధన సంస్థ ట్రెండ్ ఫోర్స్ తెలిపింది. శాంసంగ్ షేరు 8.1 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది. టెస్లాతో కొత్త ఒప్పందం శాంసంగ్ భవిష్యత్ చిప్ టెక్నాలజీని బలోపేతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌తో సహా తదుపరి తరం పరికరాలు, అనువర్తనాలకు 2-నానోమీటర్ చిప్‌లు ఎంతో అవసరం అవుతాయి.