
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత్లో తన తొలి షోరూంను ఈ వారంలోనే ప్రారంభించనుంది. టెస్లా భారత్లో తన మొదటి "ఎక్స్పీరియన్స్ సెంటర్" ను జూలై 15న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో ప్రారంభించనుందని, ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించడంలో కీలక అడుగు అని రాయిటర్స్ నివేదించింది. ఇందుకోసం టెస్లా 4,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని మార్చిలో లీజుకు తీసుకుంది. ఈ ప్రాంతం యాపిల్ స్టోర్ కు సమీపంలో ఉంది.
భారత్లో విస్తృత విస్తరణ వ్యూహంలో భాగంగా టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ లో ముంబైలోని కుర్లా వెస్ట్ లో ఒక వాణిజ్య స్థలాన్ని కంపెనీ లీజుకు తీసుకుంది. ఇది వాహన సర్వీస్ కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పుణెలో ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) సమీపంలో తాత్కాలిక కార్యాలయంతో సహా భారతదేశంలో టెస్లా మొత్తం వాణిజ్య ఆస్తులు నాలుగుకు చేరుకున్నాయి.
కాగా కంపెనీ ఇండియా హెడ్ ప్రశాంత్ మీనన్ తొమ్మిదేళ్ల తర్వాత గత నెలలో రాజీనామా చేశారు. బ్లూమ్బెర్గ్ న్యూస్ ప్రకారం.. ప్రస్తుతానికి భారత కార్యకలాపాలను చైనాకు బృందం నిర్వహిస్తోంది. అయితే టెస్లా ప్రస్తుతం భారత్లో తయారీని స్థాపించడానికి ఆసక్తి చూపడం లేదని, కేవలం షోరూమ్లు తెరిచి దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించాలనుకుంటోందని కేంద్రమంత్రి కుమారస్వామి గత నెలలో చెప్పారు.
షోరూం ప్రారంభానికి ముందు కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్ల (రూ.8.58 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత వస్తువులను దిగుమతి చేసుకుంది. జనవరి - జూన్ మధ్య వాణిజ్య షిప్పింగ్ రికార్డుల డేటా ప్రకారం.. టెస్లా భారత్కు వాహనాలు, సూపర్ ఛార్జర్లు, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికాల నుండి దిగుమతి చేసుకున్న ఆరు కార్లలో మోడల్ వై కార్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుమారు 70% దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ టెస్లా ఈ వాహనాలను తీసుకువస్తోంది.