భారత్‌లో టెస్లా 20 సూపర్ ఛార్జర్లు ఏర్పాటు | Tesla India Network 20 Superchargers Live Service Center | Sakshi
Sakshi News home page

భారత్‌లో టెస్లా 20 సూపర్ ఛార్జర్లు ఏర్పాటు

Sep 1 2026 8:44 PM | Updated on Sep 1 2026 8:50 PM

Tesla India Network 20 Superchargers Live Service Center

ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్‌లో తన మౌలిక వసతులను వేగంగా ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో పాటు విక్రయానంతర సేవలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 ‘సూపర్ ఛార్జర్ల’ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా 'టెస్లా-అప్రూవ్డ్ బాడీ షాప్' (టీఏబీ), సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.

అహ్మదాబాద్‌లో కొత్త సదుపాయం ప్రారంభోత్సవం సందర్భంగా టెస్లా ఇండియా కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో తెరిచిన ఈ సెంటర్ భారత్‌లో కంపెనీకి చెందిన 7వ బాడీ షాప్, సర్వీస్ సెంటర్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే గురుగ్రామ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణె, ముంబై నగరాల్లో టెస్లా తమ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తోంది. గుజరాత్ పరిధిలోని వినియోగదారులకు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో బాడీ రిపేర్, కొలిజన్ రిపేర్ సేవలను ఇది అందిస్తుంది.

టెస్లా వాహనాలకు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అవసరం చాలా స్వల్పమని అగర్వాల్ పేర్కొన్నారు. సింహభాగం సాంకేతిక సమస్యలను ‘రిమోట్ డయాగ్నోసిస్’ (సాఫ్ట్‌వేర్ ఆధారిత తనిఖీ) ద్వారానే పరిష్కరించవచ్చని, 24/7 సర్వీస్ అసిస్టెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో మోడల్ Y రెండు వేరియంట్లను అందుబాటులో ఉంచారు. మోడల్‌ వై ఆర్‌డబ్ల్యూడీ ధర సుమారుగా రూ.51.89 లక్షలు, మోడల్‌ వైఎల్‌ రూ.61.99 లక్షలుగా ఉంది.

ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement