‘ఏరో-ఇంజిన్’ రాజధానిగా తెలంగాణ: మంత్రి | Telangana Minister Sridhar Babu said Hyderabad Aero Engine Capital | Sakshi
Sakshi News home page

‘ఏరో-ఇంజిన్’ రాజధానిగా తెలంగాణ: మంత్రి

Oct 28 2025 8:12 PM | Updated on Oct 28 2025 8:30 PM

Telangana Minister Sridhar Babu said Hyderabad Aero Engine Capital

తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో-ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

ఆదిభట్లలో న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(TASL), సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ఫెసిలిటీ ద్వారా ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజిన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపోనెంట్), లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్ (రోటేటివ్ కాంపోనెంట్)లు తయారు కానున్నాయి.

ఈ కొత్త యూనిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్ అంటే కేవలం ‘సిటీ ఆఫ్ పెరల్స్’ మాత్రమే కాదని ‘ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్’ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

రాష్ట్రంలో ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023-24లో రూ.15,900 కోట్లు ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరిగాయని మంత్రి చెప్పారు. విమాన తయారీ కంపెనీలకు రాష్ట్రం గమ్యస్థానంగా ఉందని, ఇక్కడ తామ కార్యకలాపాలు చేపట్టాలని అంతర్జాతీయ దిగ్గజ ఏరో సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement