ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచేలా 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం (అక్టోబర్28) ఆమోదం తెలిపింది. ఎనిమిదో సెంట్రల్ పే కమిషన్ విధి విధానాలకు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) రూపొందించేందుకు కేబినెట్ ఆమోదించింది.
8వ పే కమిషన్
8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు జరిపింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి త్వరగానే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.
ఎవరిపై ప్రభావం?
ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)కు తాజాగా ఆమోదం తెలిపింది. ఇది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.
కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.

ఇదీ చదవండి: అధిక సంఖ్యలో టీకాల వల్ల పిల్లల్లో ఆటిజం: శ్రీధర్ వెంబు
60 ఏళ్లలో 260 రెట్లు పెరుగుదల
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గత ఆరు దశాబ్దాలలో (1956 నుంచి 2016 వరకు) భారీగా వృద్ధి చెందాయి. మొదటి వేతన సంఘం (1956) కాలంలో ఒక ఉద్యోగికి రూ.100 మూల వేతనం ఉంటే, అది ఏడో వేతన సంఘం (2016) నాటికి సుమారు రూ.26,000కి చేరింది. అంటే 60 ఏళ్ల కాలంలో జీతం సుమారు 260 రెట్లు పెరిగింది. 8వ పే కమిషన్ అమల్లోకి వస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
వేతన సంఘాల వారీగా జీతాల వృద్ధి (1956లో రూ.100 మూల వేతనంగా పరిగణించి)
| వేతన సంఘం (CPC) | సంవత్సరం | సవరించిన తర్వాత బేసిక్ జీతం | ముఖ్య అంశాలు |
|---|---|---|---|
| 1వ CPC | 1956 | రూ.100 | వ్యవస్థీకృత వేతన స్కేళ్ల (Structured Pay Scales)ను ప్రవేశపెట్టారు. |
| 2వ CPC | 1960 | రూ.105–110 | ద్రవ్యోల్బణం కోసం సర్దుబాట్లు చేశారు. |
| 3వ CPC | 1973 | రూ.180–200 | ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరగడం వల్ల పెంపు. |
| 4వ CPC | 1986 | రూ.700–750 | కరువు భత్యం (DA) విలీనం, భారీ పెంపు. |
| 5వ CPC | 1996 | రూ.2,500–3,000 | 30–35% పెంపును సిఫార్సు చేశారు. |
| 6వ CPC | 2006 | రూ.7,000–8,000 | పే బ్యాండ్ (Pay Band) + గ్రేడ్ పే (Grade Pay) విధానం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సుమారు 1.86గా నిర్ణయించారు. |
| 7వ CPC | 2016 | రూ.25,000–26,000 | 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ |


