
టెక్ కంపెనీ ఉద్యోగులకు ప్రస్తుత జాబ్ మార్కెట్ ప్రతికూలంగా మారుతోంది. ఇదే అదనుగా కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు పెంచడంలేదు. కొన్నిసార్లు పదోన్నతి ఇచ్చినా తక్కువ వేతనమే ఆఫర్ చేస్తున్నాయి. ఇటీవల రిపోర్టింగ్ మేనేజర్‌గా పదోన్నతి పొందిన ఓ టెక్ ఉద్యోగి వేతనం తన టీమ్ సభ్యుల కంటే తక్కువగా ఉందని ఆందోళన చెందాడు. వారి కంటే ఎంతో కష్టపడుతున్నా వేతనం మాత్రం పెంచడంలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. అదికాస్తా వైరల్‌గా మారింది.
అంతర్జాతీయంగా టెక్ సంస్థల కస్టమర్లు పెద్దగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపకపోతుండడంతో కంపెనీలు కొత్తగా రిక్రూట్‌మెంట్ ఆపేస్తున్నాయి. దాంతో ఉన్నవారితోనే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని భావిస్తున్నాయి. ఇదే అదనుగా సంస్థలో అనుభవం ఉన్న ఉద్యోగులకు పదోన్నతులిస్తున్నా అందుకు సమానంగా వేతనాన్ని మాత్రం పెంచడం లేదు.
రెడ్డిట్ పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘నేను ఇటీవల రిపోర్టింగ్ మేనేజర్‌గా పదోన్నతి పొందాను. ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నాను. నాతోపాటు 11 మంది జట్టులో ఉన్నాం. నా సహచరులకు సరాసరి రూ.15 లక్షల ప్యాకేజీ ఉంది. అందులో కొందరు రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు. కానీ నాకు రూ.9 లక్షల ప్యాకేజీ మాత్రమే. జట్టుకు మేనేజర్ స్థాయిలో ఉన్న నాకు సభ్యుల కంటే తక్కువ జీతం ఉంది. నేను వారాంతాల్లోనూ పని చేస్తున్నాను. దాదాపు ప్రతిరోజు అర్థరాత్రి వరకు వర్క్ చేస్తున్నాను. నా కంటే అధిక వేతనం పొందే సహోద్యోగులు సాయంత్రం 6 గంటలకు షట్‌డౌన్ చేస్తున్నారు. క్లిష్టమైన పనులను తప్పించుకుంటున్నారు. నా జీతం పెంచాలని పలుమార్లు హెచ్‌ఆర్‌కు మెయిళ్లు కూడా పంపాను. కానీ ఫలితం లేకపోయింది. భయట అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఏం చేయాలో సూచించండి’ అంటూ సలహా కోరాడు.
ఈ రెడ్డిట్ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ‘మీ నైపుణ్యాలు, మార్కెట్ విలువపై దృష్టి పెట్టండి. జీతంపై ఆందోళన వద్దు’ అని ఒకరు చెప్పారు. ‘మరింత ప్రయత్నం చేసి వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వండి’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘హెచ్‌ఆర్‌తో చర్చించేప్పుడు సహోద్యోగులతో ప్రత్యక్ష పోలికలు వద్దు’ అని మరొకరు తెలిపారు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!