
దేశ డిజిటల్ వృద్ధిని మరింత బలోపేతం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూడు కొత్త సాంకేతిక సర్వీసులను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో జరిగిన ‘యాక్సిలరేటింగ్ ఇండియా’ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఈ సేవలు దేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించామని కంపెనీ తెలిపింది. ఈ సర్వీసులు డేటా భద్రత, స్థిరత్వంతో పాటు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఆవిష్కరణలను వేగవంతం చేస్తాయని పేర్కొంది.
టీసీఎస్ సావరిన్‌సెక్యూర్ క్లౌడ్: దేశంలోని పబ్లిక్ సెక్టర్ కంపెనీలకు ఈ క్లౌడ్ ఏఐ సామర్థ్యాలను అందిస్తుంది. ముంబై, హైదరాబాద్‌లోని టీసీఎస్ డేటా సెంటర్లలో నిర్వహించబడే ఈ క్లౌడ్ డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం 2023కు అనుగుణంగా ఉంటుంది. 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యంతో ఈ క్లౌడ్ తక్కువ లెటెన్సీతో కీలక అప్లికేషన్లకు అవకాశం కల్పిస్తుంది. ఏఐ ఆధారిత డేటా విశ్లేషణలు, నిరంతర భద్రతా పరీక్షలతో పౌర సేవలను మెరుగుపరుస్తూ, డేటా ఆధారిత నిర్ణయాలను వేగవంతం చేస్తుంది.
టీసీఎస్ డిజిబోల్ట్: ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ డిజిబోల్ట్ డిజిటల్ ప్రక్రియలను ఆటోమేషన్ చేసి సంస్థలు తమ ఆవిష్కరణలను వేగంగా అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది.
టీసీఎస్ సైబర్ డిఫెన్స్ సూట్: ఈ ఏఐ ఆధారిత సైబర్‌సెక్యూరిటీ సర్వీసు భారత సంస్థలకు అధునాతన రక్షణను అందిస్తుంది. సైబర్ బెదిరింపులను ముందస్తుగా గుర్తించి, ఆటోమేటెడ్ రెస్పాన్స్‌తో స్పందిస్తూ, హైబ్రిడ్ మల్టీ క్లౌడ్, ఐటీ సదుపాయాలకు రక్షణ కల్పిస్తుంది. 16,000 మంది సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో టీసీఎస్ దేశంలో సైబర్ రక్షణను బలోపేతం చేస్తోంది.
ఇదీ చదవండి: ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
ఈ సందర్భంగా టీసీఎస్ ప్రెసిడెంట్ గిరీష్ రామచంద్రన్ మాట్లాడుతూ..‘దేశంలోని వివిధ సంస్థలు ఉపయోగిస్తున్న డేటాకు ఏఐ టూల్స్‌తో భద్రత కల్పిస్తున్నాం. ఈ సర్వీసులు భారత అవసరాలకు అనుగుణంగా రూపొందించాం. దేశ ఆస్తులను రక్షిస్తూ, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్‌తోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల అధికారులు పాల్గొన్నారు.