ఫ్రెషర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టీసీఎస్‌.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! 

TCS announces Honouring all job offers 100 pc variable pay for all junior employees - Sakshi

దేశీయ ఐటి సేవల దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఫ్రెషర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జాబ్‌ ఆఫర్‌ లెటర్లు పొందిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. టెక్ పరిశ్రమలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, టీసీఎస్‌ మాత్రం ఫ్రెషర్‌లను నియమించుకోవడానికి, వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని మనీకంట్రోల్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్కడ్ చెప్పారు.

ఇదీ చదవండి: పనిచేయడానికి ఇదే బెస్ట్‌ కంపెనీ.. కెరియర్‌ గ్రోత్‌ సూపర్‌!

జూనియర్‌ ఉద్యోగుల జీతాలు డబుల్‌! 
ఉద్యోగుల వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి టీసీఎస్‌ ప్రయత్నాలను ప్రకటించింది. జూనియర్‌ ఉద్యోగులు తమ నైపుణ్యం పెంచుకుని జీతాలను రెట్టింపు చేసుకునే అవకాశాలను కల్పించనున్నట్లు మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకుని తమ కెరీర్‌లో ముందుకు సాగేలా అంతర్గత శిక్షణ అందిస్తామన్నారు. ఈ శిక్షణలో వివిధ స్థాయిల నుంచి వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కంపెనీ యోచిస్తోందన్నారు. ఈ శిక్షణలో ప్రతిభ చూపి అసెస్‌మెంట్‌లను క్లియర్ చేసిన ఉద్యోగులు తమ జీతాలను రెట్టింపు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ అసెస్‌మెంట్‌లలో సంవత్సరానికి కేవలం 10 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 

100 శాతం వేరియబుల్ పే
టీసీఎస్ ఫ్రెషర్‌లకు వేతనాలను పెంచడంతోపాటు జూనియర్ స్థాయిల్లోని ఉద్యోగులకు 100 శాతం త్రైమాసిక వేరియబుల్ వేతనం అందించడాన్ని కూడా పరిశీలిస్తోందని లక్కడ్ పేర్కొన్నారు. అయితే ఈ జీతాల పెరుగుదల ఎప్పటి నుంచి ఉంటుందో ఆయన వెల్లడించలేదు. ఒకేసారి ఉద్యోగుల జీతాలు పెంచడం కన్నా శిక్షణ కార్యక్రమాలు అమలు చేసి ప్రతిభావంతులకు జీతాలు పెంచడం మెరుగైన వ్యూహమని పేర్కొన్నారు.

44,000 జాబ్ ఆఫర్లు
2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం.. టీసీఎస్‌ 44,000 మంది ఫ్రెషర్‌లకు జాబ్ ఆఫర్‌లను అందించింది. ఈ జాబ్ ఆఫర్‌లను అన్నింటినీ తాము గౌరవిస్తామని, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. తాము అన్ని జాబ్ ఆఫర్‌లను గౌరవిస్తున్నామని, 2023 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రాతిపదికన 22,600 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని లక్కడ్ చెప్పారు.

ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top