
తగ్గిన లాభాలు.. క్యూ4లో రూ. 8,556 కోట్లు
షేరుకి రూ. 6 డివిడెండ్
ఆటో రంగ టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 51 శాతం క్షీణించి రూ. 8,556 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.17,528 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.
కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,19,033 కోట్ల నుంచి రూ. 1,19,503 కోట్లకు స్వల్పంగా బలపడింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 28,149 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. 2023–24లో రూ. 31,807 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,34,016 కోట్ల నుంచి రూ. 4,39,695 కోట్లకు ఎగసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆటోమోటివ్ బిజినెస్ ప్రస్తుతం రుణరహితంగా మారినట్లు కంపెనీ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. కంపెనీ విడదీతకు వాటాదారులు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఐబీఎం హెచ్‌ఆర్‌లో ఏఐ!
జేఎల్‌ఆర్ ఓకే
క్యూ4లో లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) ఆదాయం 2 శాతం నీరసించి 7.7 బిలియన్ పౌండ్లను తాకినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పూర్తి ఏడాదికి దాదాపు యథాతథంగా 29 బిలియన్ పౌండ్ల టర్నోవర్ సాధించినట్లు తెలియజేసింది. యూఎస్, యూకే మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య డీల్ జేఎల్‌ఆర్‌కు సానుకూలమని పేర్కొంది. ఐదేళ్ల కాలంలో 18 బిలియన్ పౌండ్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ4లో టాటా మోటార్స్ స్టాండెలోన్ నికర లాభం 35 శాతం క్షీణించి రూ. 1,382 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం రూ. 20,260 కోట్ల నుంచి రూ. 19,999 కోట్లకు స్వల్పంగా నీరసించింది.