
కార్పొరేట్ కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అంతర్గత ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి, రోజువారీ పనులను తగ్గించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీ ఐబీఎం తన హెచ్ఆర్ (మానవ వనరుల) సిబ్బందిలో కొంత భాగాన్ని ఏఐ వ్యవస్థలతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఏఐ కొంతమంది హెచ్ఆర్ ఉద్యోగుల పనిని రీప్లేస్ చేస్తుందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాల వైపు కంపెనీ ఎక్కువగా మొగ్గు చూపుతుందని సంస్థ సీఈఓ అరవింద్ కృష్ణ చెప్పారు.
కంపెనీలు అంతర్గత ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, మాన్యువల్ పనులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు ఈ ధోరణి వల్ల తెలుస్తుంది. ఐబీఎం హెచ్‌ఆర్ విభాగంలో పూర్తిస్థాయి ఏఐ వాడకానికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితిని తెలియజేయనప్పటికీ, ఇప్పటికే 200 ఉద్యోగులను తొలగించినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. హెచ్ఆర్ ఉద్యోగాల తగ్గింపు అంటే కంపెనీ మొత్తంగా ఆ విభాగంలోని ఉద్యోగులను పూర్తిగా తొలగిస్తున్నట్లు కాదు. ఆటోమేషన్ ప్రక్రియలకు అనుగుణంగా ఏఐను వాడుతున్నారు. హెచ్‌ఆర్‌లో ఇతర విభాగాల్లో ఉద్యోగులు యథావిధిగా పని చేస్తారు. వాస్తవానికి ఐబీఎం మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇటీవల పెరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, మార్కెటింగ్, సేల్స్ వంటి విభాగాల్లో ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో సమస్యా పరిష్కారం, ఇంటర్ పర్సనల్ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి.
ఈ సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడిన కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ.. సంస్థలో కొన్ని పనులను ఆటోమేట్ చేయడం వల్ల ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వనరులు సమకూరుతున్నాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌ను కొన్ని ఎంటర్‌ప్రైజ్ వర్క్‌ఫ్లోలపై ఉపయోగించడం వల్ల కార్యకలాపాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఇతర విభాగాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్‌ఆర్‌లోని ప్రస్తుత ఏఐ వ్యవస్థలు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
డేటాను క్రమబద్ధీకరించడం, ఈమెయిల్స్ పంపడం లేదా అంతర్గత అభ్యర్థనలను ప్రాసెస్ చేయడం వంటి పనులను స్వతంత్రంగా నిర్వహించగల ఏఐ సాఫ్ట్‌వేర్ సాధనాల వాడకం వేగంగా పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఇంకా విస్తృతంగా లేనప్పటికీ, కొన్ని కంపెనీలు టెక్నాలజీని ఎలా సమర్థంగా ఉపయోగించాలో అన్వేషిస్తున్నాయి. ఈమేరకు నిధులను ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి.