
ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా టాటా పవర్,, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థలు మంగళవారం భారతదేశపు అతిపెద్ద టాటా. ఈవీ మెగాచార్జర్ హబ్‌ను ఆవిష్కరించాయి. ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 సమీపంలోని ది లీలా ముంబై హోటల్ ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో ఎనిమిది ఫాస్ట్ డీసీ చార్జర్లు, 16 ‘చార్జింగ్ బే’లు ఉంటాయి. ఒకేసారి 16 ఈవీలను చార్జింగ్ చేయొచ్చు.
ప్రైవేట్ కారు ఓనర్ల నుంచి ట్యాక్సీలు, రైడ్ సేవల సంస్థలు, లాజిస్టిక్స్ ఆపరేటర్లు మొదలైన వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. మరోవైపు, ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్ సంస్థ బోల్ట్‌డాట్‌ఎర్త్ తాజాగా త్రీవీలర్ ఆటోల సంస్థ యోధతో చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్, ఎర్తింగ్ సొల్యూషన్స్‌ను అందించే దిశగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంపొందించేందుకు, వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సెప్టెంబర్ 9ని ప్రపంచ ఈవీ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5.8 కోట్ల పైచిలుకు ఈవీలు ఉండగా, భారత్‌లో ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో 14.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2030 నాటికి మొత్తం వాహనాల్లో ఈవీల వాటాను 30 శాతానికి పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది.
ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! తులం ఎంతంటే..