సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అమ్మకాలకు దెబ్బ  | Sunflower oil demand in India may fall 10percent amid West Asia conflict | Sakshi
Sakshi News home page

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అమ్మకాలకు దెబ్బ 

Apr 5 2026 5:24 AM | Updated on Apr 5 2026 5:24 AM

Sunflower oil demand in India may fall 10percent amid West Asia conflict

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం 

2026–27లో 10 శాతం క్షీణత! 

క్రిసిల్‌ నివేదిక తాజా అంచనా

ముంబై: దేశీయంగా శుద్ధి చేసిన పొద్దుతిరుగుడుపువ్వు(సన్‌ఫ్లవర్‌) నూనె అమ్మకాల పరిమాణం 10 శాతం నీరసించనున్నట్లు రేటింగ్స్‌ దిగ్గజం క్రిసిల్‌ తాజా నివేదికలో అంచనా వేసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో సరఫరా సమస్యలకుతోడు.. పెరుగుతున్న ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. వెరసి వినియోగదారులు ఇతర చౌక నూనెలవైపు దృష్టి సారించనున్నట్లు నివేదికలో క్రిసిల్‌ తెలియజేసింది. దీంతో డిమాండ్‌ మందగించి ఈ ఏడాది సన్‌ప్లవర్‌ ఆయిల్‌ అమ్మకాల పరిమాణం 10 శాతం క్షీణించనున్నట్లు అభిప్రాయపడింది.  

లాజిస్టిక్స్‌ వ్యయాలు 
పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే సరఫరా సవాళ్లు తలెత్తగా.. పెరుగుతున్న లాజిస్టిక్స్‌ వ్యయాలు అధిక ధరలకు దారితీస్తున్నట్లు నివేదికలో క్రిసిల్‌ వివరించింది. ఫలితంగా వినియోగదారులు తవుడు నూనె, సోయాబీన్‌ ఆయిల్‌ తదితరాలవైపు మళ్లనున్నట్లు పేర్కొంది. అయితే సన్‌ఫ్లవర్‌ అమ్మకాల ఆదాయం మాత్రం యథాతథంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. అధిక ధరల కారణంగా అమ్మకాల పరిమాణం వెనకడుగు వేయనున్నట్లు తెలియజేసింది. కాగా.. తక్కువ వ్యయాలలో గతంలో కొనుగోలు చేసిన నిల్వల కారణంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రిఫైనరీల లాభదాయకత నిలకడను చూపనున్నట్లు విశ్లేషించింది. 

దీంతో అమ్మకాల పరిమాణం నీరసించినప్పటికీ చౌక వ్యయాల నిల్వలతో లాభాలపై ప్రభావం పడకపోవచ్చని అభిప్రాయపడింది. దేశీయంగా 2.5–2.6 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ 12–14 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు క్రిసిల్‌ వెల్లడించింది. వంట నూనెల పరిశ్రమ ముడిసన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. దీంతో ప్రపంచ వాణిజ్య విఘాతాలు, రాజకీయ భౌగోళిక అంశాలు పరిశ్రమను ప్రభావితం చేయనున్నట్లు వివరించింది. ఉక్రెయిన్, రష్యా నుంచి అత్యధికంగా దిగుమతులు నమోదవుతుంటాయి. అయితే హ ర్ముజ్‌ జల రవాణాకు విఘాతం ఏర్పడితే కేప్‌ఆఫ్‌ గుడ్‌హోప్‌ తదితర దూర తీరాల నుంచి వీటిని సమకూర్చుకోవలసి వస్తుందని తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement