
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్స్ క్లబ్‌లోకి చేరారు. 1 బిలియన్ డాలర్ల నికర సంపద పరిమితిని అధిగమించి బిలియనీర్గా అవతరించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆల్ఫాబెట్ షేర్లు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో, భారత్కు చెందిన 53 ఏళ్ల పిచాయ్ నెట్‌వర్త్ 1.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.
2023 ప్రారంభం నుంచి ఆల్ఫాబెట్ స్టాక్ 120 శాతానికి పైగా పెరగడం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరగడం ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమని బ్లూమ్బర్గ్ పేర్కొంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఒక వ్యవస్థాపకేతర సీఈఓకు ఇది అరుదైన ఘనత. మెటాకు చెందిన మార్క్ జుకర్ బర్గ్, ఎన్విడియాకు చెందిన జెన్సెన్ హువాంగ్ వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లు బిలియనీర్స్గా ముందు వరసలో ఉన్నప్పటికీ వారు తమ కంపెనీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నారు.
సీఈవోగా పదేళ్లు
ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుని కంపెనీలో ఎక్కువ కాలం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పిచాయ్ 2004లో ఆల్ఫాబెట్ ప్రధాన అనుబంధ సంస్థ గూగుల్ లో చేరారు. క్రోమ్, ఆండ్రాయిడ్ లకు ఆయన తొలినాళ్లలో చేసిన సేవలు 2015లో సీఈఓగా ఎదగడానికి పునాది వేశాయి. తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.
నిరాడంబర నేపథ్యం..
సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రెండు గదుల అపార్ట్ మెంట్ లో పెరిగారు. వారి కుటుంబానికి కారు ఉండేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారిగా ఇంటికి టెలిఫోన్ వచ్చింది. 1993 లో సుందర్ పిచాయ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి స్కాలర్షిప్ సాధించగా ఆయన్ను కాలిఫోర్నియా పంపించడానికి విమాన టికెట్ కోసం ఆయన తండ్రి ఏడాది మొత్తం జీతం కంటే కూడా పైగానే ఆ కుటుంబం ఖర్చుపెట్టాల్సి వచ్చింది.