ఫోన్ మన ఫ్రెండ్, మన స్టయిల్, కొన్నిసార్లు మన సీక్రెట్ కీపర్ కూడా! అలాంటి ఫోన్‌ను కాపాడే కవర్స్, ఫోన్ కేస్‌లను తక్కువ అంచనా వేయొద్దు! ఇవి కేవలం ప్రొటక్షన్ కోసం మాత్రమే కాదు. స్మార్ట్‌నెస్, సౌలభ్యం అన్నీ కలిపిన మ్యాజిక్ కవర్స్ కూడా!
సోలార్ కేస్!
ఫోన్ ‘లో బ్యాటరీ’ అని అరుస్తుందా? పైగా పవర్‌బ్యాంక్ కూడా మర్చిపోయారా? టెన్షన్ వద్దు! బయటకి వెళ్లి సూర్యుడి వైపు మీఫోన్‌ను చూపించండి. అప్పుడు ఈ కేస్ చెప్తుంది ‘ఓకే బ్రో, నేను ఉన్నా కదా!’ ఎందుకంటే ఇది సాధారణ ఫోన్ కవర్ కాదు. ‘అయాన్ సోలార్ కేస్’ మార్కెట్‌లో కొత్తగా వచ్చిన ఈఫోన్ కేస్ ఒక గంట సూర్యరశ్మిని ఉపయోగించి మీ ఫోన్‌ను ఫుల్ చార్జ్ చేస్తుంది. వైర్లు లేవు, ప్లగ్ లేదు. పైగా క్యూట్‌గా క్లాసీగా స్టయిలిష్ డిజైన్‌తో కూడా వస్తుంది. ఇది తొంభై ఐదు శాతం పవర్‌ను సమర్థంగా ట్రాన్స్‌ఫర్ చేయగలదు. అంటే ఎక్కడైనా, చార్జింగ్ ఎఫిషియెన్సీ పూర్తి అయితే, తర్వాతి రోజులకు ఇది, ఒక పవర్‌బ్యాంక్ లాగా బ్యాటరీని స్టోర్ కూడా చేస్తుంది. ధర 99 డాలర్లు అంటే రూ. 8,778.

సెల్ఫీ స్టార్
ఫోన్‌లో ఫొటో తీసుకుంటే వెలుతురు తక్కువగా ఉందా? వీడియో తీయాలంటే ముఖం స్పష్టంగా కనిపించడం లేదా? ఇక ఆ సమస్యలకు పూర్తి లైట్ సొల్యూషన్ వచ్చేసింది! అదే ఈ ‘సెల్ఫీ ఎల్‌ఈడీ రింగ్ లైట్ కేస్’. ఫోన్ కవర్‌లా కనిపించే ఈ కేస్‌లోనే లైట్ దాగి ఉంటుంది. బటన్ నొక్కగానే గుండ్రంగా వెలిగే రింగ్ లైట్ బయటకి వస్తుంది. ఒక్కసారి నొక్కితే లైట్ ఆన్, తర్వాతి ఆప్షన్లతో మీ ఇష్టానికి సరిపోయేలా వెలుతురు తక్కువగా లేదా ఎక్కువగా సర్దుకోవచ్చు. సెల్ఫీలు, వీడియోలు, మేకప్, రీల్‌లు ఏదైనా సరే, మిమ్మల్ని ఒక స్టార్‌లా మెరిపించే బాధ్యత ఇది తీసుకుంటుంది. అదనపు వైర్లు, బ్యాటరీల అవసరం లేకుండా, దీనిని యూఎస్‌బీ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ధర బ్రాండ్, డిజైన్ బట్టి మారుతుంది.

పాకెట్‌లో గేమ్ పార్ట్‌నర్
పెద్ద గేమ్ కంట్రోలర్‌ను జేబులో పెట్టుకొని వెళ్లడం సాధ్యం కాదు. కాని, ఫోన్‌కు ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే కేస్‌లో దాచేస్తే ఎలా ఉంటుంది ? అదే ఈ ‘ఎమ్‌కాన్ కంట్రోలర్’. ఇది బయటకి సాధారణ ఫోన్ కేసులా కనిపించినా, లోపల మాత్రం గేమింగ్ మాయ దాగి ఉంటుంది. దీని సైడ్‌లో ఉన్న రెండు బటన్లను ఒకేసారి నొక్కగానే అసలు సరదా మొదలవుతుంది! అప్పటిదాకా, ఫోన్ వెనుక దాగి ఉన్న గేమ్ కంట్రోలర్ ఒక్కసారిగా బయటకి వచ్చేస్తుంది. కనెక్ట్ చేయడం చాలా సులభం. స్క్రీన్‌ను గేమింగ్ కోణంలో సెట్ చేసి, గ్రిప్స్‌ను లాక్ చేస్తే, ఇక దీనికున్న స్మూత్ బటన్లతో ఆట నిశ్శబ్దంగా, స్మూత్‌గా సాగిపోతుంది. తక్కువ బరువుతో, స్టయిలిష్‌గా పాకెట్‌లో సులభంగా ఇమిడిపోయేలా దీని డిజైన్ ఉంటుంది. ధర 129 డాలర్లు, అంటే సుమారు రూ. 11,439.


