
భారత స్టాక్ మార్కెట్లు వారం చివరి ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో ముగించాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అధిక స్థాయిలో లాభాల బుకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్ వంటి కీలక రంగాలలో బలహీనత ఈ క్షీణతకు కారణం. బీఎస్ఈ సెన్సెక్స్ 387.73 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టపోయి 82,626.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 96.55 పాయింట్లు లేదా 0.38 శాతం తగ్గి 25,327.05 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ కాంపోనెంట్ లలో, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), భారతీ ఎయిర్ టెల్, ఎన్‌టిపిసి, ఏషియన్ పెయింట్స్ 1.13 శాతం లాభాలను నమోదు చేశాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, టైటాన్ కంపెనీ, మహీంద్రా అండ్ మహీంద్రా 1.52 శాతం నష్టపోయాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.04 శాతం, 0.15 శాతం స్వల్ప లాభాలతో ముగిశాయి.
రంగాలపరంగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.28 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టీ మెటల్, ఫార్మా, రియల్టీ సూచీలు లాభాలు పొందాయి. ఎఫ్ఎంసిజి, ఐటి, ఆటో, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 0.65 శాతం వరకు క్షీణించాయి.
మొత్తంగా మార్కెట్ విస్తృతి సానుకూలంగా ఉంది. ఎన్‌ఎస్ఈలో లిస్ట్ అయిన 3,133 స్టాక్స్ లో 1,601 లాభాలను అందుకోగా 1,427 క్షీణించాయి. 105 మారలేదు. శుక్రవారం సెషన్ ముగిసే సమయానికి, ఎన్ఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.24 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.