
ఆర్‌బీఐ పాలసీ ముందు అప్రమత్తత
సెన్సెక్స్ నష్టం 308 పాయింట్లు
ముంబై: రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పాలసీ ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకులు, చమురు షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించకలేపోతున్నాయి.
ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 308 పాయింట్లు నష్టపోయి 80,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు పతనమై 24,650 వద్ద నిలిచింది.
⇒ తొలి త్రైమాసిక నికర లాభం 56% వృద్ధి నమోదుతో గాడ్‌ఫ్రై ఫిలిప్స్ షేరుకు డిమాండ్ లభించింది. బీఎస్‌ఈలో 10% పెరిగి రూ.9887 వద్ద లోయర్ సర్క్యూట్ తాకి అక్కడే ముగిసింది.
జీవితకాల కనిష్టాన్ని తాకిన రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు నష్టపోయి 87.88 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2025 ఫిబ్రవరి 10 నాటి జీవితకాల కనిష్టం 87.95 స్థాయిని తాకింది. రష్యన్ చమురు కొనుగోలు కారణంగా భారత్‌పై సుంకాలను మరింత పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మన కరెన్సీ కోతకు ప్రధాన కారణంగా నిలిచాయి. దేశీ స్టాక్ మార్కెట్ పతనం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచింది.
ఆదిత్య ఇన్ఫోటెక్ అరంగేట్రం అదుర్స్
సీపీ ప్లస్ బ్రాండ్ కింద నిఘా పరికరాలను విక్రయించే ఆదిత్య ఇన్ఫోటెక్ షేరు ఎక్సే్చంజీల్లోకి అదిరిపోయే అరంగేట్రం చేసింది. ఇష్యూ ధర(రూ.675)తో పోలిస్తే బీఎస్‌ఈలో 51% ప్రీమియంతో రూ.1,018 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 64% ఎగసి రూ.1,104 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 61% లాభంతో రూ.1,084 వద్ద ముగిసింది.
లక్ష్మి ఇండియా ఫైనాన్స్ నిరాశ
ఎన్‌బీఎఫ్‌సీ లక్ష్మి ఇండియా ఫైనాన్స్ లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.158)తో పోలిస్తే బీఎస్‌ఈలో 14 శాతం డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 16 శాతం క్షీణించి రూ.133 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 15% నష్టంతో రూ.134 వద్ద నిలిచింది.