రూపాయి పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్
విదేశీ ఇన్వెస్టర్ల కదలికలూ కీలకమే..
తీవ్ర ఆటుపోట్లకు అవకాశం...
ఈ వారం మార్కెట్ గమనంపై విశ్లేషకుల అభిప్రాయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే భారీగా ఎగబాకిన క్రూడ్ ధరలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మన సూచీలకు కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘తుపాను ముందు ప్రశాంతత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌తో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు మొదలయ్యాయి. హార్మూజ్ జలసంధిలో అడ్డంకుల కారణంగా క్రూడాయిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 109 డాలర్లకు ఎగబాకింది. ఈ రెండు అంశాలపైనే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారిస్తారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చమురు సెగ కారణంగా రోజుకో సరికొత్త కనిష్టాలకు పడిపోతున్న రూపాయి, మరోపక్క, ద్రవ్యల్బణం భారీగా పెరిగిపోవడం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ‘అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడ్ ధరలపై దాని ప్రభావం, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్‌ను మార్కెట్ వర్గాలు నిశింతంగా గమనిస్తాయి. సమీప కాలంలో మార్కెట్లకు ఇంధన ధరలు, రూపాయి కదలికలే కీలకం’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు.
భారీ ఒడిదుడుకులు...
‘ఇరాన్–అమెరికా ఉద్రిక్తలపైనే అందరి కళ్లూ ఉన్నాయి. దీనిపైనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారపడి ఉంది. ఈ నేథ్యంలో చర్చల పురోగతి, క్రూడ్ రేట్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చు’ అని ఎన్‌రిచ్ మనీ సీఈఓ ఆర్. పోన్ముడి పేర్కొన్నారు.
రూపాయిపై ఫోకస్...
యుద్ధ భయాలకు తోడు, పెట్రో ధరల పెంపు, ప్రధాని పొదుపు చర్యల ప్రభావంతో గతవారం రూపాయి మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. డాలరు మారకంలో ఏకంగా 96 స్థాయిని కూడా దాటేసి, కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారిపోయింది. క్రూడ్ ధరలు మరింత ఎగబాకితే రూపాయి క్షీణత కొనసాగవచ్చని, ఇది మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపుందని పోన్ముడి తెలిపారు.
గణాంకాలు, ఫలితాలపైనా దృష్టి...
అమెరికా, చైనా, భారత్‌లలో విడుదలయ్యే కీలక స్థూల ఆర్థిక గణంకాలు, అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశ వివరాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. క్యూ4 ఫలితాల సీజన్ చివరి దశ నేపథ్యంలో రంగాల వారీగా స్టాక్స్‌లో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. ఈ వారం ఐఓసీ, బీపీసీఎల్, గెయిల్, ఎన్‌టీపీసీ తదితర ఫలితాలు ఉన్నాయి.
గతవారమిలా...
ప్రధాని పొదుపు పిలుపు ఎఫెక్ట్‌తో పాటు క్రూడ్ ధరల జోరు, రూపాయి పతనం వంటి ప్రతికూలతలతో గత వారం మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,090 పాయింట్లు (2.7%) పడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 533 పాయింట్లు (2.2%) క్షీణించింది.
తిరోగమనంలోనే విదేశీ ఇన్వెస్టర్లు...
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ సెగలు, రూపాయి పతన ప్రభావంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన మార్కెట్లో అమ్మకాల జోరు మరింత పెంచారు. వరుసగా మూడో నెలలోనూ రివర్స్‌గేర్‌లోనే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.27,048 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది మొత్తం రూ.2,2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించినట్లు ఎన్‌ఎస్‌డీఎల్ డేటా వెల్లడించింది. 2025 మొత్తం ఏడాదిలో నికర విక్రయాలు రూ.1.66 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాదిæ దీనికి రెట్టింపు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయనేది మార్కెట్ వర్గాలు అంచనా.
సాంకేతికంగా చూస్తే...
ఈ వారం కూడా దేశీ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో నిఫ్టీ పడితే, 23,500 వద్ద తొలి మద్దతు, 23100 స్థాయిలో రెండో మద్దతు ఉండొచ్చు. పెరిగితే 23,800 వద్ద తక్షణ నిరోధం ఉంటుంది. దానిపైన నిలదొక్కుకుంటే 24,000–24,100 వరకు పెరగవచ్చు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


