మరో విడత గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌

Sovereign Gold Bond Scheme opens on August 31 - Sakshi

గ్రాము విలువ రూ.5,117

31 నుంచి అందుబాటులోకి

ముగింపు తేదీ సెప్టెంబర్‌ 4

ముంబై: వినియోగదారులకు ఆగస్టు 31న మరో గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్‌ 4వ తేదీ వరకూ ఇది అందుబాటులో ఉంటుంది.  సెప్టెంబర్‌ 8 బాండ్‌ జారీ తేదీ.   సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2020–21 సిరీస్‌లో ఇది ఆరవది కాగా, ఇప్పటికే ఐదు పూర్తయ్యాయి. తాజా ఇష్యూలో గ్రాము ధర రూ.5,117 అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెలువరించిన ఒక ప్రకటన తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేసిన వారికి గ్రాము బాండ్‌పై రూ.50 తగ్గింపు లభిస్తుంది.  ఆగస్టు 3 నుంచి 7వ తేదీ వరకూ జరిగిన ఐదవ విడతలో గ్రాము ధర రూ.5,334గా ఉంది.  తాజా విడత గ్రాము ధరకు ఆగస్టు 26 నుంచి ఆగస్టు 28వ తేదీ మధ్య మూడు ట్రేడింగ్‌ రోజుల సగటును ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది.  

37 దఫాల్లో రూ.9,653 కోట్ల సమీకరణ
2019–20 ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం, 2015 నవంబర్‌ ప్రారంభం నుంచీ ఇప్పటి వరకూ సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ ద్వారా (37 దఫాలు) రూ.9,652.79 కోట్లను సమీకరించడం జరిగింది. 38.98 టన్నుల విలువైన గోల్డ్‌ బాండ్‌ విక్రయం జరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ  6.13 టన్నుల విలువైన గోల్డ్‌ బాండ్ల జారీ ద్వారా రూ.2,316.37 కోట్లను సమీకరణ జరిగింది.  ఎనిమిదేళ్ల కాల వ్యవధితో కూడిన ఈ బాండ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు, కోరుకుంటే ఐదవ ఏట నుంచి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్‌ గోల్డ్‌ డిమాండ్‌ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం  సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top