
పిట్ట కొంచెం.. కూత ఘనం..
పెద్ద సంస్థలను మించి చిన్న కంపెనీల పనితీరు
ఐటీలో 32 శాతం వరకు ఆదాయ వృద్ధి
బడా కంపెనీలు 4 శాతానికి పరిమితం
గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని పలు స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణించాయి. పెద్ద సంస్థలను మించిన పనితీరును కనపర్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసుల సంస్థలు అటు క్యూ4లోను ఇటు పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ అదరగొట్టాయి. కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెక్సావేర్ టెక్నాలజీస్, ఎంఫసిస్ వంటి సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 32 శాతం వరకు ఆదాయ వృద్ధి సాధించాయి.
మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్‌లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి మాత్రం సుమారు 4 శాతానికే పరిమితమైంది. పైపెచ్చు విప్రో ఆదాయం రెండు శాతం క్షీణించింది. జనవరి–మార్చి త్రైమాసికంలోను ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. సీక్వెన్షియల్‌గా కోఫోర్జ్ ఆదాయం 4.7 శాతం పెరిగి రూ. 3,410 కోట్లకు, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ ఆదాయం 12.4 శాతం వృద్ధితో రూ. 2,982 కోట్లకు చేరాయి. భారీ డీల్స్‌ను దక్కించుకున్నప్పటికీ పెద్ద కంపెనీలు మిశ్రమ ఫలితాలు కనపర్చాయి. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
కొత్త టెక్నాలజీలు, నాయకత్వం దన్ను..
చిన్న కంపెనీలు మెరుగ్గా రాణించడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. జెన్‌ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను వేగవంతంగా అందిపుచ్చుకోవడం, ప్రాజెక్టులను సత్వరం ఎగ్జిక్యూట్ చేయగలగడం, స్థిరమైన నాయకత్వం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. జెన్‌ఏఐలాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీలనేవి, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా తమను తాము మల్చుకోగలిగే చిన్న సంస్థలకు అవకాశంగా, ప్రస్తుతమున్న భారీ సంస్థలకు కొంత సవాలుగా మారొచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (కేఐఈ) ఒక నివేదికలో తెలిపింది.
వ్యయాలను తగ్గించే కొత్త టెక్నాలజీలను వెనువెంటనే అందించేలా తమ సర్వీస్ పోర్ట్‌ఫోలియోలను పునర్‌వ్యవస్థీకరించుకోవడమనేది పెద్ద సంస్థలకు కాస్త సవాలుగా ఉంటుందని పేర్కొంది. వాటి భారీ పరిమాణమే ఇందుకు కారణమని వివరించింది. అదే మధ్య స్థాయి కంపెనీలు, దీర్ఘకాలికంగా వ్యూహాత్మక ప్రయోజనాలు పొందేందుకు స్వల్పకాలికంగా ఆదాయాన్ని పణంగా పెట్టేందుకు సాహసం చేయడానికి వీలుంటుందని వివరించింది. స్థిరమైన నాయకత్వం కూడా కంపెనీల పనితీరులో కీలక పాత్ర పోషిస్తోంది.
చాలా మటుకు మధ్య స్థాయి కంపెనీల సీఈవోలు అయిదేళ్లకు పైగా కొనసాగుతుండటం వల్ల విజన్, ఎగ్జిక్యూషన్ నిలకడగా ఉంటోంది. పెద్ద కంపెనీల లీడర్‌షిప్‌లలో మాత్రం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023 జూన్‌లో టీసీఎస్ సీఈవోగా కె. కృతివాసన్ నియమితులు కాగా, 2023 డిసెంబర్‌లో టెక్ మహీంద్రాకు మోహిత్ జోషి, 2024 ఏప్రిల్‌లో విప్రోకు కొత్త సీఈవోగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు.
ఈసారీ జోరు ..
గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య స్థాయి సంస్థల జోరు కొనసాగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కోఫోర్జ్‌లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి 16.4 శాతం స్థాయి నుంచి 20.8 శాతానికి పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్డర్లు పెద్ద సంఖ్యలో లభిస్తుండటం, అలాగే డీల్స్ పరిమాణం కూడా భారీ స్థాయిలో ఉండటం ఇందుకు దోహదపడొచ్చని పేర్కొన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.56 బిలియన్ డాలర్ల మెగా డీల్ కుదుర్చుకున్న ఏకైక దేశీ కంపెనీగా కోఫోర్జ్ నిల్చిందని వివరించాయి.
అమెరికాకు చెందిన సేబర్‌కు 13 ఏళ్ల పాటు సర్వీసులు అందించేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడనుంది. మరోవైపు, పెద్ద కంపెనీలే కాస్త అనిశ్చితి ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీల్స్ బాగానే ఉంటున్నా, అమెరికాలో టారిఫ్‌లపరమైన అనిశ్చితులు, డిస్క్రిషనరీ వ్యయాల విషయంలో క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం వంటి అంశాలతో స్థూలఆర్థిక పరిస్థితులపై ఆందోళన నెలకొనడం ఇందుకు కారణం.
ఎఫ్‌ఎంసీజీలోనూ అదే తీరు..
నీల్సన్‌ఐక్యూ నివేదిక ప్రకారం వినియోగదారుల బడ్జెట్‌కి అనుగుణమైన ఉత్పత్తులను అందించడంలో పెద్ద బ్రాండ్లకు చిన్న బ్రాండ్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 17.8 శాతం మేర వృద్ధి సాధించాయి. మిడ్ సైజ్ సంస్థలు 14.6 శాతం మేర పెరిగాయి. దాదాపు రూ. 5 లక్షల కోట్ల దేశీ ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో చిన్న, మధ్య స్థాయి సంస్థల వాటా సుమారు 35 శాతం ఉంటుంది. లో బేస్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త మెరుగుపడటం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం తదితర అంశాలు వీటికి సానుకూలంగా నిల్చాయి.
మరోవైపు, రూ. 5,000 కోట్లకు పైగా రెవెన్యూ ఉండే దిగ్గజాలు క్యూ4లో 6.4 శాతం మాత్రమే వృద్ధి కనపర్చాయి. బడా కంపెనీల ఉత్పత్తుల ధరలు 4.7 శాతం పెరగ్గా, అమ్మకాల పరిమాణం 1.7 శాతంగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ధరలు 0.3 శాతం తగ్గగా అమ్మకాల పరిమాణం ఏకంగా 8.1 శాతంగా నమోదైంది. నివేదిక ప్రకారం.. చిన్న ప్యాక్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దన్నుతో జనవరి–మార్చి త్రైమాసికంలో ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) రంగం 11 శాతం వృద్ధి చెందింది.