
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) యాజమాన్య కుటుంబీకులు తమ షేర్లను అమ్ముకుంటున్నారు. ముగ్గురు కుటుంబ సభ్యులు దక్షిణ కొరియాలో సుమారు 1.73 ట్రిలియన్ వాన్ (దాదాపు రూ.10,200 కోట్లు) విలువైన కంపెనీ వాటాలను విక్రయించనున్నారు. ఇటీవల కొరియా ఎక్స్చేంజ్‌కు అందజేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ వివరాలను కంపెనీ వెల్లడించింది.
విక్రయించే వాటాల్లో 17.7 మిలియన్ షేర్లు ఉండగా, ఇవి చైర్మన్ జే వై.లీ తల్లి హాంగ్ రా-హీ, ఆయన సోదరీమణులు లీ బూ-జిన్, లీ సియో-హ్యూన్‌లకు చెందినవి. 2020లో లీ కుటుంబ పెద్ద లీ కున్-హీ మరణించిన తర్వాత విధించిన సుమారు 12 ట్రిలియన్ వాన్‌ల (దాదాపు రూ.66,800 కోట్లు) వారసత్వ పన్ను చెల్లించేందుకు ఈ విక్రయం చేపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ విక్రయ ప్రక్రియను (stake sale) షిన్హాన్ బ్యాంక్, ట్రస్ట్ కాంట్రాక్టు కింద నిర్వహించనుండగా, 2026 ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. లీ బూ-జిన్, లీ సియో-హ్యూన్, హాంగ్ రా-హీ తమ వాటాలో 0.3% వాటాను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఇది వారసత్వ పన్ను చెల్లింపులో సహాయపడే దిశగా ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సంవత్సరం ఇంతవరకు శాంసంగ్ స్టాక్ ధర 84% పైగా పెరిగింది. శుక్రవారం 0.2% పెరిగి 97,900 వాన్‌లకు చేరుకుంది. జూలైలో టెస్లాతో చిప్ సరఫరా ఒప్పందం ప్రకటించిన తర్వాత, కంపెనీ షేర్లు 48% వృద్ధి చెందిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శాంసంగ్.. ఓపెన్ ఏఐ, ఎన్‌విడియా వంటి కీలక కస్టమర్లతో సరఫరా ఒప్పందాలు కుదుర్చుకుంది.
కార్పొరేట్ విశ్లేషణ సంస్థ లీడర్స్ ఇండెక్స్ అధిపతి పార్క్ జు-గన్ మాట్లాడుతూ.. “గత ఏడాది ప్రకటించిన 10 ట్రిలియన్ వాన్ షేర్ బైబ్యాక్ ప్రణాళిక ద్వారా స్టాక్ విలువను రక్షించడంతోపాటు, వారసత్వ పన్నుకు నిధులు సమకూర్చేందుకు కూడా కుటుంబానికి ఇది తోడ్పడింది" అన్నారు.
అయితే, ప్రస్తుతం లాభాల్లో ఉన్న సమయంలో ఇలా వాటాలు విక్రయించడం రిటైల్ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. "శాంసంగ్ స్టాక్ దేశవ్యాప్తంగా సుమారు 5 మిలియన్ల రిటైల్ వాటాదారుల యాజమాన్యంలో ఉంది. వారు షేర్ ధర 100,000 వాన్ మార్కును చేరాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు" అని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్..