Skoda Octavia Sales: లక్ష మార్క్‌ చేరేందుకు ఇరవై ఏళ్లు పట్టింది.. అయినా ఈ కారు ఇప్పటికీ తోపే

Skoda Octavia Model Sales Crossed One Lakh Units In India - Sakshi

స్లో అండ్‌ స్టడీ విన్‌ ది రేస్‌ అనే నానుడికి అచ్చంగా సరిపోయేలా సాగింది ఇండియాలో స్కోడా ఓక్టావియా కారు ప్రస్థానం. ఇండియన్‌ మార్కెట్‌లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. అయితే సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ కాలేదు. అలాగని దీనితో పాటు రిలీజైన మోడల్ల మాదిరి కనుమరుగైపోలేదు. అలా.. అలా.. మార్కెట్‌లో తన మార్క్‌ చూపిస్తూనే ఉంది. ఇక ఈ మోడల్‌ డిస్‌కంటిన్యూ అనుకునే టైమ్‌లో ఏదో మ్యాజిక్‌ చోటు చేసుకుని మళ్లీ మార్కెట్‌లో నిలదొక్కుకుంది. ఇలా ఎట​‍్టకేలకు ఇండియాలో లక్ష యూనిట్ల అమ్మకాల రికార్డును స్కోడా ఓక్టావియా క్రాస్‌ చేసింది.

ఇండియన్‌ మార్కెట్‌లో స్కోడాకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటు ఎంట్రీ లెవల్‌ అటు హై ఎండ్‌ మోడళ్లు కాకుండా లగ్జరీ ఫీచర్లను మిడ్‌ రేంజ్‌ ధరల్లో అందివ్వడం స్కోడా ప్రత్యేకత. ఎవరైనా స్కోడా కస్టమర్‌గా మారితే మళ్లీ ఆ బ్రాండ్‌ వదిలేందుకు ఇష్టపడరు అని చెప్పుకునేంత నమ్మకం ఉంది స్కోడాకి. అయితే బ్రాండ్‌ నుంచి వచ్చిన ఏ మోడల్‌ కూడా అమ్మకాల్లో అద్భుతాలు సాధించలేదనే చెప్పాలి. ఆలస్యంగానైనా ఓక్టావియా ఆ ఫీట్‌ను చేరుకుంది.

లగ్జరీ ఫీచర్లు, సరికొత్త డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందుబాటులో ధరల్లో అందించే మోడల్‌గా ఇండియన్‌ మార్కెట్‌లోకి స్కోడా ఓక్టావియా 2001లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అమ్మకాలు సోసోగానే ఉన్నాయి. దీంతో 2010లో ఓక్టావియాను ఇండియన్‌ మార్కెట్‌లో డిస్‌ కంటిన్యూ చేస్తున్నట్టుగా స్కోడా ప్రకటించింది. ఓక్టావియా స్థానంలో లారాను మార్కెట్‌లోకి తెచ్చింది. కానీ మూడేళ్లు తిరిగే సరికి సరికొత్త జనరేషన్‌ పేరుతో ఓక్టావియా మళ్లీ ఇండియన్‌ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు ఓక్టావియా ఫోర్త్‌ జనరేషన్‌ కారు మార్కెట్‌లో ఉంది. ఓక్టావియా 2021లో లానెన్‌ అండ్‌ క్లెమెంట్‌ మోడళ్లను మార్కెట్‌ రిలీజ్‌ చేసింది. ప్రారంభ ధర రూ.25.99 లక్షలుగా ఉంది. బ్లూ, బ్లాక్‌, వైట్‌ రంగుల్లో లభిస్తోంది. సెవన్‌ స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, 320 ఎన్‌ఎం టార్క్‌, 190 బీపీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాగా ఇరవై ఏళ్ల తర్వాత ఇండియాలో ఓక్టావియా అమ్మకాలు లక్ష యూనిట్లు దాటాయి. క్వాలిటీలో కాంప్రమైజ్‌ కాకపోతే లైఫ్‌ టైం ఎక్కువగా ఉంటుంది అనడానికి ఒక్టావియా ఓ ఉదాహారణగా నిలిచింది. లక్ష యూనిట్ల అమ్మకాల మార్క్‌ను ఓక్టావియా అధిగమించడం పట్ల స్కోడా ఇండియా హెడ్‌ జాక్‌ హోలిస్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

చదవండి: అమ్మకాల్లో బీభత్సం సృష్టిస్తున్న కారు.. కేవలం రెండేళ్లలోనే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top