పీఎన్‌బీ స్కాం: చోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీసు ఎత్తివేత కలకలం

Setback for India fugitive businessman Mehul Choksi removed from Interpol Red Notice - Sakshi

సాక్షి,ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ. 13వేల కోట్ల రుణం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి సంబంధించికీలక పరిణామంకలకలం రేపింది. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్‌నుంచి చోక్సీ పేరును తొలగించింది. దీంతో అతనిని స్వదేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బేనని విమర్శలు వెల్లువెత్తాయి. 2018 డిసెంబర్‌లో జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్  ఇపుడు ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే మెహుల్ చోక్సీ విదేశీ గడ్డపై దొరికితే అరెస్ట్  చేసే అధికారాన్ని భారత ప్రభుత్వం కోల్పోయినట్టే. అయితే తాజా పరిణామంపై  సీబీఐ ఇంకా  ఎలాంటి అధికారిక ప్రకటన  జారీ చేయలేదు.

పీఎన్‌బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నమెహుల్ చోక్సీ పేరు ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుండి  తొలగించారు. లియోన్-హెడ్‌క్వార్టర్డ్ ఏజెన్సీకి చోక్సి  అప్పీల్‌ మేరకే చోక్సీ పేరును రెడ్ లిస్ట్‌లో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఇంటర్‌పోల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అయిదేళ్లనుంచి పరారీలో ఉన్న చోక్సీని ఇండియాకు ఎపుడు రప్పిస్తారంటూ   కాంగ్రెస్‌  ట్విటర్‌ ద్వారా మోదీ సర్కార్‌ను ప్రశ్నించింది.

రెడ్ నోటీసు (లేదా రెడ్ కార్నర్ నోటీసు) 
2018లో  డిసెంబరు   రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ  అయింది.  నాలుగేళ్ల తరువాత  మెహుల్ చోక్సీని రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్‌ తొలగించింది.  తాజా నివేదికల ప్రకారం  ఆ నోటీసు ఇప్పుడు ఇంటర్‌పోల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదు. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి, మొత్తం రెడ్ నోటీసుల సంఖ్య 7023కి చేరింది. 

ఇంటర్‌పోల్‌లో 195 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు అనేది అప్పగించడం, లొంగిపోవడం లేదా ఇలాంటి చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాన్ని అమలు చేసేవారికి చేసే అభ్యర్థన. రెడ్ నోటీసు అరెస్ట్ వారెంట్‌తో సమానం కాదు.  అయితే సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనేదానిపై సభ్యదేశాలు తమ స్వంత చట్టాలను వర్తింపజేయాలి. అనేక సందర్భాల్లో  నిందితుడిని  కోరుకున్న దేశానికి అప్పగిస్తారు. 

కాగా పీఎన్‌బీ స్కాం ప్రధాన నిందితుడు డైమండ్‌ వ్యాపారి నీరవ్‌మోదీకి దగ్గరి బంధువు మెహుల్ చోక్సీ. దేశంలో అతిపెద్ద స్కాం వెలుగులోకి రావడంతో ఆంటిగ్వా , బార్బుడా పారిపోయి, అక్కడి పౌరసత్వం పొందాడు. ఈడీ, సీబీఐ దర్యాప్తు, ఫుజిటివ్‌ నేరస్తుడుగా కేంద్రం ప్రకటించింది.  సీబీఐ అభ్యర్థన మేరకు పది నెలల తర్వాత ఇంటర్‌పోల్ అతడి రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే సీబీఐ ఛార్జిషీట్‌పై చోక్సీ అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు,పలు సందర్భాల్లో భారతీయ జైళ్లు, ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ కీలక పరిణామాల మధ్య మే 2021లో చోక్సీ ఆంటిగ్వా నుండి అదృశ్యమైనాడు. ఆ తరువాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడన్న ఆరోపణలపై డొమినికాలో అరెస్ట్‌ కావడంతో 51 రోజులు డొమినికా జైలులో గడిపాడు. అనంతరం అక్రమంగా ప్రవేశించిన చోక్సీపై ఉన్న అన్ని అభియోగాలను కూడా డొమినికా  కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top