క్రాష్‌ టు బౌన్స్‌బ్యాక్‌! | Sensex jumps 1,750 pts from days low, Nifty reclaims 22,700 points | Sakshi
Sakshi News home page

క్రాష్‌ టు బౌన్స్‌బ్యాక్‌!

Apr 3 2026 4:30 AM | Updated on Apr 3 2026 4:30 AM

Sensex jumps 1,750 pts from days low, Nifty reclaims 22,700 points

సెన్సెక్స్‌ మైనస్‌ 1,588 పాయింట్ల నుంచి ప్లస్‌ 185 పాయింట్లకు 

ఇంట్రాడే కనిష్టం నుంచి 530 పాయింట్లు కోలుకున్న నిఫ్టీ  

రూపాయి రికవరీ, బ్యాంకులు, ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం నుంచి అనూహ్యంగా కోలుకొని స్వల్ప లాభంతో ముగిసింది. ఐటీ, బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు, ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి గణనీయమైన రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇంట్రాడేలో 1,588 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ చివరికి 185 పాయింట్ల లాభంతో 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం నుంచి 530 పాయింట్లు కోలుకుంది. 

ఆఖరికి 34 పాయింట్లు పెరిగి 22,713 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా 4.67%, జపాన్‌ 2.43%, ఇండోనేసియా 2.24%, తైవాన్‌ 1.85% క్షీణించాయి. చైనా, హాంగ్‌కాంగ్‌ 1%, సింగపూర్‌ అరశాతం నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ ఇండెక్సులు అరశాతం పతనమయ్యాయి. బ్రిటన్‌ సూచీ 1% పెరిగింది. అమెరికా స్టాక్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

ఆరంభంలో భారీ క్రాష్‌: రానున్న 2–3 వారాల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యుద్ధ హెచ్చరికలు, క్రూడాయిల్‌ ధరలు ఎగసిపడటం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 1,588 పాయింట్లు కుప్పకూలి 71,546 వద్ద, నిఫ్టీ 497 పాయింట్లు క్షీణించి 22,183 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి.  

రికవరీ కారణాలు ఇవే: ఆర్‌బీఐ నియంత్రణ చర్యలతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 152 పైసలు బలపడింది. మిడ్‌ సెషన్‌ నుంచి ఐటీ, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్‌ షేర్లలో వాల్యూ బయింగ్‌ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టం (71,546) నుంచి 2023 పాయింట్లు ఎగసి 73,569 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇంట్రాడే కనిష్టం (22,183) నుంచి 600 పాయింట్లు ర్యాలీ చేసి 22783 వద్ద గరిష్టాన్ని అందుకుంది.

సాయి పేరెంటరల్స్‌ లిస్టింగ్‌ సక్సెస్‌
ఫార్మాస్యూటికల్‌ కంపెనీ సాయి పేరెంటరల్స్‌ లిస్టింగ్‌ మెప్పించింది. ఇష్యూ ధర (రూ.392)తో పోలిస్తే బీఎస్‌ఈలో 3% ప్రీమియంతో రూ.405 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 6.17% పెరిగి రూ.416 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 3.67% లాభంతో రూ.406 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,795.44 కోట్లుగా నమోదైంది.

→ పవర్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ పవరికా లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.395)తో పోలిస్తే 7.34% డిస్కౌంటుతో రూ.366 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 365 – 397 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 2.53% నష్టంతో రూ.385 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,872 కోట్లుగా నమోదైంది.
→ బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్‌ చంద్‌ జగదీష్‌ కుమార్‌(ఎక్స్‌పోర్ట్స్‌) పేలవంగా లిస్టయింది. బీఎస్‌లో ఇష్యూ ధర (రూ.212)తో పోలిస్తే 8% డిస్కౌంటుతో రూ.195 వద్ద లిస్టయ్యింది. రోజంతా నష్టాల్లో ట్రేడవుతూ చివరికి 11% పతనంతో రూ.189 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement