ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అత్యవసర రుణ హామీ పథకం (ECLGS) 5.0’ కింద ఎస్‌బీఐ కస్టమర్లకు పెద్ద మొత్తంలో రుణ సాయం లభించనుంది. ఈ పథకం కింద తమ కస్టమర్లకు రూ.70,000 నుంచి రూ.80,000 కోట్ల వరకు రుణాలు అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు.
విడుదలైన మార్గదర్శకాలు ప్రకారం.. తమ కస్టమర్లలో ఎవరికి ఈ పథకం కింద రుణ అర్హత ఉందో తెలిసిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో నౌకా రవాణాకు ఆటంకాలు ఏర్పడి, సమస్యలను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు మూలధన నిధుల మద్దతుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.2.55 లక్షల కోట్లతో ఈసీఎల్‌జీఎస్ 5.0 పథకాన్ని మంగళవారం ప్రకటించడం తెలిసిందే.
ఈ పథకం కింద ఎయిర్‌లైన్స్‌కు రూ.5,000 కోట్లను పక్కన పెట్టగా, మిగిలిన రూ.2.50 లక్షల కోట్లను ఎంఎస్‌ఎంఈలతోపాటు, సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర వ్యాపార సంస్థల రుణాల కోసం కేటాయించారు. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం చాలా రంగాలపై విస్తృతంగా ఉన్నట్టు శెట్టి చెప్పారు. ఈసీఎల్‌జీఎస్ పథకాన్ని సకాలంలో తీసుకొచ్చిన చురుకైన చర్యగా పేర్కొన్నారు. అయితే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రుణం తీసుకుంటారని చెప్పలేమన్నారు.
ఈ పథకానికి అమలుకు సంబంధించి నిర్వహణ అంశాలను బ్యాంక్‌లు వచ్చే 8–10 రోజుల్లో పరిష్కరించుకుంటాయని తెలిపారు. బ్యాంకింగ్ అంతటా మొత్తం మీద 1.1 కోట్ల మంది లబ్దిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని చెప్పారు. సాధారణంగా ఎంఎస్‌ఎంఈలకు వర్తించే దానికంటే తక్కువ వడ్డీ రేటు ఈ పథకం కింద ఉంటుందన్నారు.


