Vicky Kaushal: ఐటీ జాబ్‌ వదిలేసి మరీ సినిమాల వైపు.. సర్దార్‌ ఉదమ్‌తో భారీ స్టార్‌డమ్‌

Sardar Udham Actor Vicky Kaushal Life Story And Remuneration Details - Sakshi

Vicky Kaushal Life And Success Story: ఏ రంగంలో అయినా పోటీతత్వం.. దానికి సమాంతర కోణంలో ఎదురుదెబ్బలు, అవమానాలు, ఛీత్కారాలు ఎదురవ్వడం సహజం. అన్నింటిని తట్టుకుని నిలబడిన వాళ్లే ఆయా రంగాల్లో రాణించిన సందర్భాలూ చూస్తుంటాం కూడా.  సినీ పరిశ్రమ అందుకు అతీతం కాదు. అలాగే ఆ లిస్ట్‌లో విక్కీ కౌశల్‌ అనే పేరునూ నిరభ్యంతరంగా చేర్చొచ్చు. 

‘సర్దార్‌ ఉదమ్‌’..  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈమధ్యే రిలీజ్‌ అయిన బయోపిక్‌ డ్రామా. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు సర్దార్‌ ఉదమ్‌ సింగ్ జీవితం ఆధారంగా దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ తీసిన మూవీ ఇది. 1919-జలియన్‌ వాలాబాగ్‌ దుశ్చర్యకు కారకుడైన జనరల్‌ ఓ డయ్యర్‌ను ఉదమ్‌ సింగ్ చంపేసే సీక్వెన్స్‌ ఆధారంగా మాత్రమే తీసిన మూవీ ఇది. ఇప్పటిదాకా వచ్చిన బయోపిక్‌లకు భిన్నంగా కేవలం సెంటర్‌ ఆఫ్‌ పాయింట్‌ మీద నడిచిన డ్రామా కావడం, అందులో విక్కీ కౌశల్‌ నటన అమోఘంగా ఉండడంతో పాజిటివ్‌ రివ్యూలు, ప్రశంసలు దక్కించుకుంటోంది ఈ సినిమా. 

Sardar Udham సినిమా ముందుదాకా బాలీవుడ్‌లో సుమారు రూ. 3 నుంచి 5 కోట్ల దాకా రెమ్యునరేషన్‌ ఇచ్చిన నిర్మాతలు.. ఇప్పుడు విక్కీ కౌశల్‌కి ఇప్పుడు ఒక్క సినిమా కోసం ఏకంగా రూ. 20 కోట్ల దాకా ఆఫర్‌ చేస్తుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఐటీ జాబ్‌ వదిలేసి.. 
సూపర్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌.. పట్టుమని పదిహేను సినిమాలు కూడా చేయని విక్కీ కౌశల్‌ను ముద్దుగా సినీ అభిమానులు పిల్చుకుంటున్న పేరు. పంజాబీ కుటుంబంలో పుట్టిన విక్కీ కౌశల్‌.. ముంబై ఆర్జీఐటీలో ఇంజినీరింగ్‌ చదివాడు. అయితే తండ్రి శ్యామ్‌ కౌశల్‌ స్టంట్‌ మాస్టర్‌ కావడం వల్లనో ఏమో ఐటీ జాబ్‌లో ఇమడలేకపోయాడు విక్కీ.  కిషోర్‌ నమిత్‌ కపూర్‌ ఫిల్మ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించాడు.

వేల కొద్ది అడిషన్స్‌కు హాజరైనప్పటికీ.. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. కొన్నిచోట్ల ఛీదరించుకుని వెళ్లగొట్టారట. ఆ అవమానం తన కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతోందని తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించాడు విక్కీ. ఇక సెలక్ట్‌ అయిన పది అడిషన్‌ల అవకాశాలూ.. కెమెరా ముందుకు తీసుకెళ్లలేకపోయాయట. దీంతో కొద్దిపాటి పరిచయాలతో దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసీపూర్‌’ సిరీస్‌ కోసం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాడు. ఇందుకుగానూ కౌశల్‌ అందుకున్న జీతం నెలకు రూ.4,500. 

మసాన్‌ నుంచి..
మోడలింగ్‌ కుర్రాడిలా ఉండడం విక్కీకి తర్వాతి కాలంలో కలిసొచ్చింది. ఓ సినిమాలో చిన్న రోల్‌, ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తర్వాత ‘బాంబే వెల్వెట్‌’లో ఛాన్స్‌ ఇచ్చాడు అనురాగ్‌ కశ్యప్‌. ఇందుకోసం పదివేల రెమ్యునరేషన్‌ అందుకున్నాడు విక్కీ.  ఆ తర్వాత పూర్తి స్థాయి నటుడిగా ‘మసాన్‌’ నుంచి విక్కీ కౌశల్‌ హవా మొదలైంది. ‘రామన్‌ రాఘవ 2.0, రాజీ, లస్ట్‌స్టోరీస్‌, సంజూ’ చిత్రాలు విలక్షణ నటుడిగా విక్కీకి పేరు తెచ్చాయి. రాజ్‌కుమార్‌ రావ్‌, ఆయుష్మాన్‌ ఖురానా లాంటి టాలెంటెడ్‌ నటులతో పోటీపడేలా చేశాయి.

ఇక  ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రయిక్స్‌’ విక్కీ కౌశల్‌కు జాతీయ అవార్డుతో పాటు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు సర్దార్‌ ఉదమ్‌ ఏకంగా టాప్‌ లీగ్‌లోకి చేర్చేసింది. విక్కీ కౌశల్‌ తర్వాతి చిత్రం ‘షామ్‌ బహదూర్‌’ కూడా ఫీల్డ్‌ మార్షల్‌ షామ్‌ మానెక్‌షా బయోపిక్‌. విశేషం ఏంటంటే.. ఒకప్పుడు ఎవరైతే అడిషన్స్‌ నుంచి అవమానకరంగా వెళ్లగొట్టారో.. వాళ్లలో కొందరు ఇప్పుడు కాల్‌షీట్స్‌ కోసం క్యూ కడుతుండడం తన సక్సెస్‌ తీవ్రత ఏంటో చెబుతోందని అంటున్నాడు విక్కీ కౌశల్‌. 

బ్రాండ్‌ కౌశల్‌
ఉరి: ది సర్జికల్‌ స్ట్రయిక్స్‌.లో నటన విక్కీ కౌశల్‌ను దేశం మొత్తానికి దగ్గర చేసింది. ఈ క్రేజ్‌ను వాడుకునేందుకు పెద్ద కంపెనీలకే కాదు.. లోకల్‌ ప్రొడక్టులు సైతం విక్కీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా మార్చేసుకున్నాయి. రియలన్స్‌ ట్రెండ్‌లాంటి బడా బ్రాండ్‌తో పాటు బౌల్ట్‌ ఆడియో బ్రాండ్‌, హవెల్స్‌ ఇండియా, ఒప్పో లాంటి బ్రాండ్‌లకు ఎండార్స్‌మెంట్‌లు ఉన్నాయి. ప్రతీ బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌కు 2 నుంచి 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. ఇక తాజాగా రష్మిక మందానతో విక్కీ కౌశల్‌ తీసిన అండర్‌వేర్‌ యాడ్‌ విమర్శలు-ట్రోలింగ్‌ ఎదుర్కొన్నప్పటికీ.. మూస పద్దతులకు భిన్నంగా సాగిందన్న కోణంలోనూ చర్చ నడిచింది.

చదవండి: కత్రినాతో డేటింగ్‌.. ఏం మాయచేశావే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top