వింటేజ్‌ లుక్‌తో ‘650 సీసీ’ బుల్లెట్‌ బండి  | Royal Enfield launches Bullet 650 cc In Indian Markets | Sakshi
Sakshi News home page

వింటేజ్‌ లుక్‌తో ‘650 సీసీ’ బుల్లెట్‌ బండి 

May 29 2026 4:16 AM | Updated on May 29 2026 4:16 AM

Royal Enfield launches Bullet 650 cc In Indian Markets

ప్రారంభ ధర రూ. 3.64 లక్షలు 

రెండు రంగుల్లో అందుబాటులోకి.. బుకింగ్స్‌ షురూ

ముంబై: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ తన ఐకానిక్‌ మోటార్‌సైకిల్‌ ‘బుల్లెట్‌’ను అత్యంత శక్తివంతమైన 650సీసీ వెర్షన్‌లో గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌ ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.3,64,856గా నిర్ణయించింది. ‘కానన్‌ బ్లాక్‌’, ‘బ్యాటిల్‌షిప్‌ బ్లూ’ అనే రెండు రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా బుకింగ్స్, విక్రయాలు ప్రారంభమయ్యాయి. 

బుల్లెట్‌కు ఉన్న సాంప్రదాయ డిజైన్‌ను కొనసాగిస్తూ, ఆధునిక సాంకేతికతను జోడించి ఈ కొత్త మోడల్‌ను స్టైలిష్‌గా, శక్తివంతంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 650సీసీ ట్విన్‌–సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చడంతో సుదూర ప్రయాణాలు, హైవే రైడింగ్‌కు మెరుగైన పనితీరు లభిస్తుంది. ఈ బైక్‌కు 6–స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్‌ క్లచ్‌ను జతచేశారు. దీంతో గేర్‌ మార్పులు స్మూత్‌గా ఉండటంతో పాటు రైడింగ్‌ అనుభవం మెరుగుపడుతుంది. 

1954 నాటి క్లాసిక్‌ బుల్లెట్‌ మోడల్‌ను గుర్తుచేసేలా క్యాస్కెట్‌ స్టైల్‌ హెడ్‌ల్యాంప్‌తో పాటు ఐకానిక్‌ ‘టైగర్‌–ఐ’ పైలట్‌ ల్యాంప్స్‌ను అమర్చారు. ఆధునిక ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ను కూడా ఇందులో అందించారు. క్రోమ్‌ ఫినిషింగ్‌తో కూడిన ట్విన్‌ ‘పీషూటర్‌’ ఎగ్జాస్ట్‌లు బైక్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకురావడంతో పాటు బుల్లెట్‌కు ప్రత్యేకమైన గంభీరమైన శబ్దాన్ని అందిస్తాయి. పాతకాలపు అనలాగ్‌ శైలిని కొనసాగిస్తూ ఆధునిక ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇందులో ఏర్పాటు చేశారు. ఇందులో ఫ్యూయెల్‌ స్థాయి, గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్, ట్రిప్‌ మీటర్, సరీ్వస్‌ రిమైండర్‌ వంటి వివరాలు కనిపిస్తాయి. సింగిల్‌–పీస్‌ బెంచ్‌ సీటు తో పాటు షోవా కంపెనీ సస్పెన్షన్‌ వ్యవస్థను ఉపయోగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement