ఎలక్ట్రిక్‌ వాహనాలకు స్టార్టప్‌ల జోరు.. 

Rising Demand Charges Up Electric Two Wheeler Manufacturing - Sakshi

ఇంధన రేట్ల పెంపుతో ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు డిమాండ్‌ 

వెల్లువెత్తుతున్న బుకింగ్స్‌ 

ఉత్పత్తిని పెంచుతున్న ఎథర్‌ తదితర కంపెనీలు 

న్యూఢిల్లీ: ఒకవైపు ఇంధనాల రేట్లు పెరుగుతుండటం మరోవైపు ఎలక్ట్రిక్‌ వాహనాలకు (ఈవీ) ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండటం వంటి పరిణామాలు దేశీయంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు కలిసి వస్తోంది. సరఫరాను మించి ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు డిమాండ్‌ నెలకొంటోంది. దీంతో ఈ విభాగంలోని స్టార్టప్‌ సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకునే పనిలో ఉన్నాయి.

ఎథర్‌ ఎనర్జీ కొత్తగా రెండో ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇది వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4,00,000 యూనిట్లుగా ఉంటుంది. ఎథర్‌కు ఇప్పటికే 1,20,000 యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంలో హోసూరులో ఒక ప్లాంటు ఉంది. ఇది ఉత్పత్తి ప్రారంభించిన 10 నెలల్లోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సంస్థకు హీరో మోటోకార్ప్‌ తోడ్పాటు అందిస్తోంది. మరోవైపు, అనుకున్న స్థాయి కన్నా ప్రీ–బుకింగ్స్‌ వెల్లువెత్తడంతో కోయంబత్తూర్‌కు చెందిన బూమ్‌ మోటార్స్‌ సంస్థ.. కొత్తగా మరో ప్లాంటు ఏర్పాటు చేసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1,00,000 యూనిట్లుగా ఉండనుంది. అటు గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఈ మధ్యే తమిళనాడులోని రాణిపేట్‌లో కొత్తగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంటును ప్రారంభించింది. దీని వార్షిక ఉత్పత్తి సామర్త్యం 10 లక్షల ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ యూనిట్లుగా ఉంటుంది. ఇక ఈ రంగానికి సారథ్యం వహిస్తున్న హీరో ఎలక్ట్రిక్‌ వచ్చే ఐదేళ్ల పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 10 లక్షల యూనిట్లుగా పెంచుకునే ప్రణాళికల్లో ఉంది.  

భారీగా ప్రీ–ఆర్డర్లు...  
గతేడాది నవంబర్‌ నుంచి అమ్మకాలు నెలవారీగా 20 శాతం పైగా వృద్ధి చెందుతున్నట్లు ఎథర్‌ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో వాహనాల బుకింగ్స్‌ నాలుగు రెట్లు పెరిగినట్లు వివరించింది. అటు బూమ్‌ మోటార్స్‌ తమ ఎలక్ట్రిక్‌ బైక్‌ కార్బెట్‌ కోసం నవంబర్‌ 12న బుకింగ్స్‌ ప్రారంభించగా.. కేవలం 17 రోజుల్లోనే 36,000 పైచిలుకు ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది.

బంగ్లాదేశ్, నేపాల్, దక్షిణాఫ్రికా, టర్కీ వంటి దేశాల నుంచి కూడా సం స్థకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. సింపుల్‌ వన్‌ పేరిట టూవీలర్‌ ఆవిష్కరించిన.. సింపుల్‌ ఎనర్జీ అనే సంస్థ కూడా తమకు ప్రీ–బుకింగ్‌లో 30,000 పైచిలుకు ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపింది.  

భారీ పెట్టుబడులు.. 
డిమాండ్‌కు తగ్గట్లుగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను సరఫరా చేసేందుకు కంపెనీలు గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. ఎథర్‌ వచ్చే అయిదేళ్లలో రూ. 650 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ దాదాపు రూ. 700 కోట్లు ఈ–మొబిలిటీ విభాగంపై ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అద్దెకు ఇచ్చే స్టార్టప్‌ సంస్థ బౌన్స్‌ కూడా తయారీలోకి అడుగుపెడుతోంది.

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ, బ్యాటరీ మార్పిడి ఇన్‌ఫ్రా విస్తరించడంపై వచ్చే 12 నెలల్లో రూ. 742 కోట్లు పైగా వెచ్చించనున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో వివేకానంద హలెకెరె తెలిపారు. కంపెనీకి రాజస్తాన్‌లోని భివాడీలో 1,80,000 స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటు ఉంది. అటు గుజరాత్‌లోని వడోదరకు చెందిన వార్డ్‌విజార్డ్‌ ఇన్నోవేషన్స్‌ అండ్‌ మొబిలిటీ కూడా సొంత ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. 

అంచనాలు అప్‌... 
2030 నాటికి మొత్తం దేశీయ టూ–వీలర్‌ మార్కెట్లో వీటి వాటా 30 శాతం పైగా చేరవచ్చని భావిస్తున్నట్లు నొమురా రీసెర్చ్‌ తెలిపింది. ఎథర్‌ ఎనర్జీ తదితర సంస్థలన్నీ ఉత్పత్తి సామర్థ్యాలను భారీగా పెంచుకునే పనిలో ఉండటం ఇందుకు నిదర్శనమని వివరించింది.

చౌక రుణాలపై ఆర్‌బీఐ దృష్టి
ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈవీల కొనుగోలు కోసం ప్రాధాన్యతా రంగం (పీఎస్‌ఎల్‌) కింద రుణాలు ఇవ్వాలంటూ నీతి ఆయోగ్‌ చేసిన ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ పరిశీలిస్తోంది. ఒకవేళ దీనికి ఆమోదముద్ర లభిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభించగలవు. ప్రస్తుతం ఆటో రిటైల్‌ విభాగానికి పీఎస్‌ఎల్‌ రుణాలు లభిస్తున్నాయి.

అయితే, ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో ఎదురయ్యే రిస్కుల విషయంలో స్పష్టత లేకపోవడంతో, వీటికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనుకాడుతున్నాయి. కాలుష్యకారక వాయువులను తగ్గించడంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు కీలకపాత్ర పోషించగలవని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐకి సదరు ప్రతిపాదన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పీఎస్‌ఎల్‌ కింద ఈవీలను చేర్చడం వల్ల వడ్డీ భారం తగ్గడమే కాకుండా మరింత మందికి రుణ సదుపాయం లభిస్తుందని కాంత్‌ వివరించారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top