ద్రవ్యోల్బణానికి పెట్రో మంట | Retail inflation may reach 5 percent by June: petrol prices have been increased by Rs 7. 38 | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణానికి పెట్రో మంట

May 27 2026 12:19 AM | Updated on May 27 2026 7:53 AM

Retail inflation may reach 5 percent by June: petrol prices have been increased by Rs 7. 38

5 శాతానికి చేరుకోవచ్చు 

ఆర్‌బీఐ అప్రమత్తతతో వేచిచూడొచ్చు 

అంతకు మించితే పెంచక తప్పదు 

ఆర్థికవేత్తల అభిప్రాయాలు

న్యూఢిల్లీ: ఇంధన (పెట్రోల్, డీజిల్, గ్యాస్‌) ధరల పెంపు, బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకం పెంపుతో రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌లో 5 శాతానికి చేరుకోవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఇంధన ధరల ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించేంత వరకు ఆర్‌బీఐ రేట్ల పెంపు విషయమై వేచిచూడొచ్చని పేర్కొన్నారు. మే 15 నుంచి విడతల వారీగా లీటర్‌ పెట్రోల్‌ ధరను రూ.7.38, లీటర్‌ డీజిల్‌ ధరను రూ.7.48 వరకు కేంద్రం పెంచడం తెలిసిందే. 

దీంతో పెట్రోల్, డీజిల్‌ను ముడిసరుకుగా వినియోగించే రవాణా తదితర రంగాలపై ఈ ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు బంగారం, వెండి దిగుమతులపై 6 శాతంగా ఉన్న బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని కేంద్రం 15 శాతానికి పెంచడం తెలిసిందే.  

5 శాతం దాటితే పెంచడమే! 
‘‘పెట్రోలియం ఇంధన ధరలను లీటర్‌కు రూ.7.5 వరకు పెంచడంతో వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 75 బేసిస్‌ పాయింట్లు (0.75 శాతం) వరకు పెరగొచ్చు. మే నెలకు 4–4.5 శాతం స్థాయిలో, జూన్‌లో 4.5–5 శాతం స్థాయిలో నమోదు కావొచ్చు. సీపీఐ పెరుగుదల అన్నది ధరల ఆధారితం. రెపో రేటులో మార్పులు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంపై పరిమిత ప్రభావమే చూపిస్తుంది. 

కనుక పెట్రోల్‌ ధరల పెంపు ప్రభావం ఒక త్రైమాసిక కాలంలో ఎలా ఉంటుందో ఆర్‌బీఐ పరిశీలించొచ్చు. ఒకవేళ సీపీఐ ద్రవ్యోల్బణం 5 శాతం మించిపోతుంటే ఆర్‌బీఐ వేచి చూడకుండా రేట్ల కఠినతరాన్ని మొదలు పెట్టొచ్చు’’ అని ఈవై ఇండియా ముఖ్య ఆర్థిక సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు.  

ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చు.. 
జూన్‌ సమీక్షలో రేట్ల పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని బార్‌క్లేస్‌ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ఆస్థా గుడ్వాణి సైతం పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంధన ధరల పెంపుతో రవాణా ధరలు ఎగసి పలు రంగాల్లోని ఉత్పత్తులు ప్రియంగా మారతాయని.. ద్వితీయార్ధంలో  ద్రవ్యోల్బణం ఎగిసిపడొచ్చన్నారు. దీంతో రేట్ల పెంపు తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

జూన్‌లో యథాతథమే.. 
జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతాన్ని మించొచ్చని, అయినప్పటికీ ఆర్‌బీఐ గరిష్ట పరిమితి 6 శాతంలోపే ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ మేఘా అరోరా అంచనా వేశారు. ఇంధన ధరల పెంపుతో 38 బేసిస్‌ పాయింట్లు పెరగొచ్చని తెలిపారు. జూన్‌ 5 నాటి ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం రేట్లపై యథాతథ స్థితికే మొగ్గుచూపొచ్చని అరోరా సహా ఇతర ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 42 నెలల గరిష్ట స్థాయి 8.3%కి ఎగిసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలకు స్వల్పంగా పెరిగి 3.48% స్థాయిలో ఉంది. ఇటీవల పెట్రో ధరల పెంపు, బంగారం, వెండి దిగుమతులపైనా సుంకాల పెంపుతో మే, జూన్‌ నెలలకు ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్‌ ఏర్పడింది. దీంతో ఆర్‌బీఐ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement