కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్
రెపో 5.25%; రివర్స్ రెపో 3.35%
తటస్థ విధానమే కొనసాగింపు..
2026–27 వృద్ధి అంచనా 6.9 శాతమే
ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.9 శాతానికి తగ్గించింది. ప్రస్తుతానికి పరిస్థితులను సునిశితంగా గమనిస్తూ, స్పష్టత వచ్చే వరకు వేచి చూడడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది.
దీంతో రెపో రేటు 5.25 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) రేటు 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు 5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఇక వడ్డీ రేట్లకు సంబంధించి తన విధానాన్ని తటస్థంగానే ఆర్‌బీఐ కొనసాగించింది. ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా యుద్ధంతో ముడి చమురు ధరలు గరిష్టాలకు పెరిగిపోవడం, రూపాయి బలహీనపడడం, ఎగుమతులు/దిగుమతులకు ఏర్పడిన అవరోధాలను ఆర్‌బీఐ ఎంపీసీ ప్రస్తావించింది. ఇరాన్–అమెరికా కాల్పుల విరమణనను సమీక్షలో పరిగణనలోకి తీసుకున్నా మని ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా చెప్పారు.
పాలసీ ముఖ్యాంశాలు..
→ గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.6 శాతం కాగా, ప్రస్తుత 2026–27లో 6.9 శాతానికి పరిమితం కావొచ్చు.
→ పశ్చిమాసియా యుద్ధం ఎంత కాలం పాటు కొనసాగుతుంది? నష్టం ఏ మేరకు అన్నది ద్రవ్యోల్బణం, వృద్ధి రిస్‌్కలను నిర్ణయిస్తుంది.
→ ద్రవ్యోల్బణం 2026–27లో 4.6 శాతంగా ఉండొచ్చు. క్యూ1లో 4 శాతం, క్యూ2లో 4.4 శాతం, క్యూ3లో 5.2 శాతం, క్యూ4లో 4.7 శాతంగా అంచనా. ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతం కాగా, అసాధారణ పరిస్థితుల్లో గరిష్టంగా 6 శాతం మించకుండా చూడాలన్న విధానాన్ని అనుసరిస్తోంది.
→ 2026–27లో రూపాయి డాలర్‌తో 94 వద్ద, ముడి చమురు బ్యారెల్‌కు 85 డాలర్ల వద్ద (సగటున) స్థిరపడొచ్చు.
→ 2025 ఫిబ్రవరి వరకు ఆర్‌బీఐ మొత్తం మీద 1.25% మేర రెపో రేటును తగ్గించడం గమనార్హం.
→ తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్ష జూన్ 3 నుంచి 5 వరకు ఉంటుంది.
దీర్ఘకాలం పాటు తక్కువ రేట్లే...
పశ్చిమాసియా ఘర్షణలు ఎగుమతులు, వృద్ధిని అడ్డుకోవచ్చు. ఇంధన ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో విఘాతాలు కీలక ముడి సరుకుల లభ్యతను అడ్డుకుంటుంది. ఇది వ్యవసాయం, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. వృద్ధిని నిదానింపజేయొచ్చు. అయినప్పటికీ దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. తటస్థ విధానాన్నే కొనసాగిస్తున్నాం. మధ్యకాలం నుంచి దీర్ఘకాలం పాటు కనిష్ట వడ్డీ రేట్లే కొనసాగుతాయి.
– ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా


