ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ ఊరట

RBI takes IDBI Bank out of prompt corrective action list - Sakshi

ఆర్‌బీఐ డేగకళ్ల నుంచి బయటపడ్డ ఐడీబీఐ బ్యాంక్‌ 

పీసీఏ ఫ్రేమ్‌వర్క్‌ నుంచి తప్పించిన సెంట్రల్‌ బ్యాంక్‌

ఫెనాన్షియల్‌ పరిస్థితుల మెరుగుతో కీలక నిర్ణయం  

సాక్షి, ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ను తన తీవ్ర నియంత్రణా పర్యవేక్షణా పరిధి (లేదా తగిన దిద్దుబాటు చర్యలు-పీసీఏ) నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం తొలగించింది. బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ పరిస్థితులు మెరుగుపడ్డంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగేళ్ల క్రితం 2017 మేలో ఐడీబీఐ బ్యాంక్‌ పీసీఏ ఫ్రేమ్‌వర్క్‌ కిందకు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన సమస్యలతో పాటు 2017 నాటికి నికర మొండిబకాయిలు బ్యాంక్‌ రుణాల్లో 13 శాతానికి చేరడం వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఐడీబీఐ బ్యాంకుతోపాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ చేయడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత నెల ప్రారంభంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలోనే ఆర్‌బీఐ తాజా ప్రకటన వెలువడ్డం గమనార్హం. 

కొనసాగనున్న పర్యవేక్షణ! 
తాజాగా 2021 ఫిబ్రవరి 18వ తేదీన ఫైనాన్షియల్‌ సూపర్విజన్‌ (బీఎఫ్‌ఎస్‌) బోర్డ్‌ ఐడీబీఐ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ పరిస్థితులపై సమీక్ష జరిపింది. 2020 డిసెంబర్‌ 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్‌ ప్రకటించిన ఫలితాల ప్రకారం మూలధనం, ఎన్‌పీఏలు, లీవరేజ్‌ నిష్పత్తి అంశాల్లో బ్యాంక్‌ పీసీఏ మార్గదర్శకాలకు లోబడి ఉంది. అలాగే ఇందుకు సంబంధించి నియమనిబంధనలకు కట్టుబడి ఉంటానని కూడా బ్యాంక్‌ లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ‘‘ఈ అంశాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌ను పీసీఏ చట్రం నుంచి తీసివేస్తున్నాం. అయితే మూలధనం, ఎన్‌పీఏలు, లీవరేజ్‌ నిష్పత్తి వంటి అంశాలన్నింటినీ మున్ముందూ జాగ్రత్తగా పర్యవేక్షించడం జరుగుతుంది’’ అని ఆర్‌బీఐ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. 

క్యూ3లో మంచి పనితీరు నేపథ్యం... 
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ 2020–21 డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.378 కోట్ల(స్టాండెలోన్‌ ప్రాతిపదికన) నికర లాభాన్ని ఆర్జించింది. వడ్డీ ఆదాయాలు బాగుండడం ఇందుకు ప్రధాన కారణం. 2019–20 ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.5,763 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.1,532 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.1,810 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎం) 60 బేసిస్‌ పాయింట్లు(100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెరిగి 2.27 శాతం నుంచి 2.87 శాతానికి ఎగసింది. స్థూల ఎన్‌పీఏలు 28.72% నుంచి 23.52 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 5.25 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. 2019–20 క్యూ3తో పోల్చితే బ్యాంక్‌ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top