
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించిన తరువాత భారత బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు లిక్విడిటీ గణనీయంగా పెరుగుతుందని కొన్ని సంస్థల నివేదికలు చెబుతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ లిక్విడిటీ రూ .6 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఆర్‌బీఐ ప్రభుత్వానికిచ్చే డివిడెండ్లు రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ.2.75 లక్షల కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఇది కేంద్ర ఆర్థిక వనరులను గణనీయంగా పెంచుతుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి.
అధిక రాబడినిచ్చే అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ మారక నిల్వలపై రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. రూపాయి అస్థిరతను నిర్వహించడానికి డాలర్లను విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలతో ఆర్‌బీఐ ఆదాయం సమకూర్చుకుంటోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బాండ్ మార్కెట్ ద్వారా ఆర్‌బీఐ రూ.1.95 లక్షల కోట్లు రాబడిని అందుకున్నట్లు అంచనా. ఆర్‌బీఐ క్రియాశీల డాలర్ అమ్మకాలు కూడా ఈ ఆదాయానికి తోడయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి స్థూల డాలర్ అమ్మకాలు 371.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2024 సెప్టెంబర్‌లో విదేశీ మారక నిల్వలు 704 బిలియన్ డాలర్లకు చేరాయి. తర్వాత కాలంలో ఆర్‌బీఐ 125 బిలియన్ డాలర్లకుపైగా విక్రయించినట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
మే చివరి నాటికి బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ మరింత మెరుగుపడి రూ.5.5-6 లక్షల కోట్లకు చేరుకుంటుందని బార్క్లేస్ అంచనా వేసింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్-పూచీకత్తు అవసరం లేకుండా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి అదనపు లిక్విడిటీని సమకూర్చకోవడానికి ఆర్‌బీఐ ప్రవేశపెట్టే సాధనం) రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి దగ్గరగా వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్ (డబ్ల్యూఏసీఆర్) తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితులు ఆర్‌బీఐ రాబోయే ద్రవ్య విధాన వైఖరిని ప్రభావితం చేయనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, జూన్‌లో జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.