Rakesh Jhunjhunwala: ఛాఛా!! ఆ పిచ్చిప‌ని చేయ‌క‌పోతే మ‌రో వెయ్యికోట్లు సంపాదించే వాడిని

Rakesh Jhunjhunwala Comments On Real Estate Sector - Sakshi

ముంబై: బ్లూచిప్‌ స్టాక్స్‌తో పోలిస్తే రియల్టీ డెవలపర్లు తక్కువ రిటర్నులతోనే నెట్టుకొస్తున్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. అందుబాటు ధరల హౌసింగ్‌ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు మాత్రమే స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్‌కు వెళ్లగలవని అభిప్రాయపడ్డారు. ఆశించిన స్థాయిలో అమ్మకాల పరిమాణాన్ని సాధించగలగడం దీనికి కారణమని తెలియజేశారు.

డీఎల్‌ఎఫ్, మాక్రో డెవలపర్స్‌ తదితర కొద్ది సంస్థలు మాత్రమే లిస్టింగ్‌ను చేపట్టినట్లు పేర్కొన్నారు. డీఎల్‌ఎఫ్‌ షేరును తీసుకుంటే ఒకప్పుడు రూ.1,300 ధర నుంచి రూ.80కు పడిపోవడాన్ని ప్రస్తావించారు. ఇది రియల్టీ విభాగంలోని రిస్కులను వెల్లడిస్తున్నట్లు తెలియజేశారు. ఆకాశ పేరుతో ఇటీవల విమానయాన కంపెనీ ఏర్పాటుకు తెరతీసిన ఝున్‌ఝున్‌వాలా.. రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా స్టాక్‌ మార్కెట్, తదితర బిజినెస్‌లలో ఇన్వెస్ట్‌ చేసే సంగతి తెలిసిందే. 
 
ఆధారపడలేం 
తాను రియల్టీ డెవలపర్‌ను అయి ఉంటే కంపెనీని లిస్టింగ్‌ చేయబోనంటూ రాకేష్‌ వ్యాఖ్యానించారు. అనిశ్చితులతో కూడిన బిజినెస్‌ కావడమే దీనికి కారణమని తెలియజేశారు. రియల్‌ఎస్టేట్‌ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో రాకేష్‌ ప్రసంగించారు. బ్లూచిప్‌ స్టాక్స్‌ 18–25 శాతం లాభాలను అందిస్తున్న సమయంలో 6–7 శాతం రిటర్నులకు పరిమితమయ్యే రియల్టీని లిస్టింగ్‌ చేయడంలోని ఔచిత్యాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌ఈఐటీ)లు, కమర్షియల్‌ రియల్టీ పట్ల ఇన్వెస్టర్లు ఆశావహం(బుల్లిష్‌)గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐటీ సర్వీసులు, ఫార్మా తదితర రంగాలు వీటికి దన్నునివ్వవచ్చని అభిప్రాయపడ్డారు. 
 
గతంలో పెట్టుబడులు 
గతంలో ఐదు రియల్టీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్‌ చేసినట్లు రాకేష్‌ వెల్లడించారు. తద్వారా లాభాలు ఆర్జించినట్లు తెలియజేశారు. ఇల్లు కొనుగోలుకి ఆసక్తి పెరుగుతున్నదని, ఇకపై రియల్టీ రంగానికి ఆశావహ పరిస్థితులు ఏర్పడనున్నట్లు అంచనా వేశారు. తాను కూడా 2006లో ఇంటి కొనుగోలు కోసం క్రిసిల్‌ షేర్ల విక్రయం ద్వారా రూ.20 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. అయితే ఈ వాటాను విక్రయించకుంటే ఈరోజు మరో రూ.1,000 కోట్ల సంపదను ఆర్జించేవాడినని తెలియజేశారు.

కాగా.. ఆకాశ పేరుతో కొత్త విమానయాన సంస్థ ఏర్పాటుపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కంపెనీలో రూ. 275 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలియజేశారు. పలు యూరోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు దెబ్బతిన్న సమయంలో ప్రారంభమైన ర్యాన్‌ ఎయిర్‌ తొలి రోజునుంచే లాభాలు ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా రాకేష్‌ ప్రస్తావించారు. స్టాక్‌ మార్కెట్లో లాభాలు ఆర్జించినట్లే ఆకాశ సంస్థను విజయవంతం చేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top