క్యూ1 ఫలితాలు, ప్రపంచ పరిణామాలే కీలకం

Q1 results based on global developments are crucial - Sakshi

విదేశీ ఇన్వెస్టర్ల వైఖరిపైనా దృష్టి

రిలయన్స్‌ ఆర్థిక ఫలితాలు 23న వెల్లడి

బక్రీద్‌ సందర్భంగా బుధవారం సెలవు

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అభిప్రాయం

ముంబై: కార్పొరేట్ల తొలి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్‌ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకంగా మారొచ్చని చెబుతున్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికల అంశాలు సైతం ట్రేడింగ్‌ ప్రభావితం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు. అలాగే కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మార్కెట్‌ సోమవారం ముందుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆర్థిక గణాంకాలు, రిలయన్స్‌ – జస్ట్‌ డయల్‌ విలీన ప్రక్రియ అంశాలపై స్పందించాల్సి ఉంటుంది. బక్రీద్‌ పండుగ సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. కావున ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది.  

‘‘దేశీయంగా సానుకూల సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. సూచీల తాజా గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. ఈ అంశాలు ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను ప్రేరేపించవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,950 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ నిరాలి షా తెలిపారు.   

దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కావడంతో పాటు కంపెనీలు ఆశాజన ఆర్థిక ఫలితాల ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో నెలరోజుల తర్వాత గతవారంలో సూచీలు తిరిగి సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఆర్థిక, బ్యాంక్స్, క్యాపిటల్‌ గూడ్స్, హెల్త్‌కేర్, మెటల్స్‌ షేర్లు రాణిండంతో క్రితం వారంలో సెన్సెక్స్‌ 754 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లను ఆర్జించగలిగాయి.

కీలక దశకు కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల సందడి...
దేశీయ కార్పొరేట్ల తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల ప్రకటన సందడి కీలక దశకు చేరుకుంది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాలకు చెందిన అనేక పెద్ద కంపెనీలు ఈ వారంలో తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఐసీసీఐ బ్యాంకులతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని మొత్తం పది కంపెనీలున్నాయి. జూన్‌ క్వార్టర్‌ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.

నేడు రెండు లిస్టింగ్‌లు...  
ఇటీవల ఐపీఓ ఇష్యూలను పూర్తి చేసుకున్న రోడ్ల నిర్మాణ సంస్థ జీఆర్‌ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ క్లీన్‌ సైన్స్‌ టెక్నాలజీ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. గ్రే మార్కెట్లో ఇరు కంపెనీల షేర్లు 55–60 శాతం ప్రీమియం ధర పలుకుతున్నాయి. కావున లాభదాయక లిస్టింగ్‌కు అవకాశం ఉందని ట్రేడర్లు అంచనావేస్తున్నారు.

ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు  
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై తొలి భాగంలో రూ.4,515 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో ఎఫ్‌ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top