డిపాజిట్ల వేటలో ప్రైవేటు బ్యాంకులు టాప్‌ | Private banks outpace PSBs in Q4 deposit growth | Sakshi
Sakshi News home page

డిపాజిట్ల వేటలో ప్రైవేటు బ్యాంకులు టాప్‌

Apr 8 2026 12:37 AM | Updated on Apr 8 2026 7:47 AM

Private banks outpace PSBs in Q4 deposit growth

2025–26 క్యూ4లో 12–17 శాతం వృద్ధి 

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వృద్ధి 2–14 శాతమే

ముంబై: డిపాజిట్ల వేటలో ప్రభుత్వరంగ బ్యాంకులతో ప్రైవేటు బ్యాంక్‌లు గట్టి పోడీ పడుతున్నాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకులు అధిక డిపాజిట్లను సమీకరించడం ఇందుకు నిదర్శనం. 2025–26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్లలో 12–17 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కానీ, ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 2–14 శాతానికి పరిమితమైనట్టు డేటా స్పష్టం చేస్తోంది. సాధారణంగా బ్యాంకులకు కరెంట్‌ అకౌంట్‌ అండ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ (కాసా) డిపాజిట్లు చాలా చౌక రేట్లకే లభిస్తుంటాయి. ఇతర ఆర్థిక సాధనాల్లో ఇంతకుమించి మెరుగైన రాబడులతో కాసా డిపాజిట్లు క్రమంగా తగ్గిపోతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బ్యాంక్‌లు సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్‌ (సీడీ)ల జారీ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయి.  

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో అధిక వృద్ధి.. 
ప్రైవేటు బ్యాంకుల్లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ డిపాజిట్లలో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. డిపాజిట్లు 17.2 శాతం పెరిగి రూ.2.84 లక్షల కోట్లకు చేరాయి. ఆ తర్వాత కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ డిపాజిట్లు 14.7 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిపాజిట్లు 14.4 శాతం చొప్పున పెరిగాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్యధికంగా 14.33 శాతం వృద్ధిని నమోదు చేయగా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 14 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ ఇండియా 13.37 శాతం చొప్పున డిపాజిట్లను పెంచుకున్నాయి. మార్చి త్రైమాసికం ముగిసిన తర్వాత కొన్ని బ్యాంక్‌లు విడుదల చేసిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఈ వ్యత్యాసం కనిపించింది. దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐ ఇంకా ఈ వివరాలు విడుదల చేయలేదు.  

రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల పైచేయి 
మార్చి త్రైమాసికంలో రుణాల పరంగా ప్రభుత్వరంగ బ్యాంకులు మెరుగైన పనితీరు చూపించాయి. రుణాల్లో 12–22 శాతం వరకు వృద్ధిని సాధించాయి. అదే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో రుణ వృద్ధి 12–20 శాతంగానే ఉంది. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రుణాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో సంస్థ లోన్‌బుక్‌ రూ.2.92 లక్షల కోట్లకు చేరింది. యూకో బ్యాంక్‌ లోన్‌బుక్‌ 20 శాతం పెరిగి రూ.2.34 లక్షల కోట్లకు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లోన్‌బుక్‌ సైతం 18.90 శాతం పెరిగి రూ.3.45 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ఇక మార్చి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకుల నిర్వహణ లాభం (కేటాయింపులకు ముందు) 9.1 శాతం, నికర లాభం 11.9 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement