మీ షేర్లు, మార్కెట్‌ విలువను తెలపండి

Prannoy Roy & Radhika Roy Offer NDTV Shares As Security For SEBI Penalty - Sakshi

ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్‌ రాయ్‌ ఆయన భార్య రాధికా రాయ్‌ల షేర్లు, వాటి విలువను శుక్రవారం నాడు తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే...  కంపెనీ పునర్‌ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్‌పబ్లిష్డ్‌ ప్రైస్‌ సెన్సిటివ్‌ ఇన్ఫర్మేషన్‌ (యూపీఎస్‌ఐ)ను దుర్వినియోగపరచి న్యూ ఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీటీవీ)షేర్ల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా  రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ది పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా  సెబీ వద్ద 45 రోజులలోపు డిపాజిట్‌ చేయాలని సెబీ గత ఏడాది నవంబర్‌ చివర్లో  ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్‌డీటీవీ ప్రమోటర్లపై రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్‌ లావాదేవీల నుంచి నిషేధించింది. 

2006 సెప్టెంబర్‌– 2008 జూన్‌ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్‌ రాయ్‌ ఎన్‌డీటీవీకి చైర్మన్‌గా, హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. సెబీ ఆదేశాలపై ఎన్‌డీటీవీ ప్రమోటర్లు సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌)ని ఆశ్రయించారు. అయితే ఇన్‌సైడర్‌ లావాదేవీ ద్వారా అక్రమంగా పొందినట్లు సెబీ గుర్తించిన మొత్తంలో 50 శాతం డిపాజిట్‌ చేయాలని శాట్‌ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై రాయ్‌ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి అప్పీల్స్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. తమ వద్ద తగిన వేరే ఆదాయ వనరులు ఏవీ లేనందున, సెబీ జరిమానాకు ఎన్‌డీటీవీ షేర్లనే హామీగా పెడతామని రాయ్‌ దంపతుల తరఫు న్యాయవాది ముకుల్‌ రోతంగీ ఆఫర్‌ చేశారు.దీనిని పరిశీలించిన చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డీ నేతృత్వంలోని ధర్మాసనం షేర్ల విలువ స్టేట్‌మెంట్‌ను శుక్రవారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top