Diesel-Petrol Price: సామాన్యుడు బతికేది ఎలా?.. మోత మోగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Petrol, Diesel Prices Hiked on March 31, 9th Rise In Last 10 Days - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత 10 రోజుల్లో ఇంధన ధరలు లీటరుకు 6.40 రూపాయలకు పెరిగాయి. దీంతో, సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి వస్తువు ధర పెరగడంతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు ఉంది సామాన్యుడి పరిస్థితి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరగడం వల్ల కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన ప్రారంభించింది. 

గత ఏడాది నవంబర్ 4 చివరి సారిగా ఇంధన ధరలు పెరిగాయి. అప్పటి నుంచి మార్చి 22 వరకు ఇంధన ధరలలో పెద్ద మార్పు లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరలు పెంచడానికి కేంద్రం సాహసించలేదు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు పెంపు మొదలు పెట్టింది. అయితే, ఈ అంశంపై స్పందించిన కేంద్రం, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్దం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచాల్సి వచ్చినట్లు తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.

పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 80 పైసల చొప్పున పెంచిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.81 ఉండగా.. డీజిల్ లీటర్ రూ.93.07 వద్దకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.94కు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంటే.. డీజిల్ ధర రూ.97.52కు చేరుకుంది. ఇక కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు ₹.111.35(83 పైసలు పెరిగింది), లీటర్ డీజిల్ ధర ₹96.22 (80 పైసలు పెరిగింది)గా ఉంది.

(చదవండి: కేంద్రం కీలక నిర్ణయం, అకౌంటెన్సీ వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top