
ప్రపంచవ్యాప్తంగా వెబ్ బ్రౌజర్ల మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ క్రోమ్‌కు సవాల్ విసిరేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన పర్పెక్స్‌సిటీ ఏఐ సిద్ధమవుతోంది. త్వరలోనే కామెట్ పేరుతో ఏఐ ఆధారిత సామర్థ్యంగల వెబ్ బ్రౌజర్‌ను తీసుకురానుంది. – సాక్షి, సెంట్రల్‌డెస్క్
మార్కెట్.యూఎస్ అనే సంస్థ నివేదిక ప్రకారం 2024లో 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ల మార్కెట్.. 2034 నాటికి 76.8 బిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉంది. స్టాట్‌కౌంటర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి ప్రపంచ వెబ్ బ్రౌజర్ల మార్కెట్‌లో క్రోమ్ 68 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికం మంది యూజర్లు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్‌గా మార్కెట్‌ను సుస్థిరం చేసుకొని ఇతర ప్రముఖ వెబ్ బ్రౌజర్లయిన సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్‌కు అందనంత ఎత్తులో ఉంది.

యూజర్లకు లభించేవి ఇవీ..
సాధారణ బ్రౌజర్లతో పోలిస్తే ఏఐ ఆధారిత బ్రౌజర్లు యూజర్లు కోరిన కంటెంట్‌ను సంక్షిప్తంగా అందించగలవు. అలాగే టాస్క్‌లను ఆటోమేట్ చేయగలవు. ఉదాహరణకు ఈ–మెయిళ్లకు ఆటోమెటిక్‌గా రిప్లైలు పంపడం, సోషల్ మీడియా పోస్ట్‌లను షెడ్యూల్ చేయడం, దరఖాస్తుల్లోని డేటాను సంగ్రహించడం లాంటివి అన్నమాట.
ముఖ్యంగా సందర్భానుసారంగా జవాబులు అందించగలవు. అంటే యూజర్లు అందించే ఇన్‌పుట్‌లు, డేటా హిస్టరీని పరిగణనలోకి తీసుకొని, వాటిని విశ్లేషించి జవాబులను అందించడం, వివిధ డేటా సోర్స్‌ల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నేరుగా సమాధానాలు ఇవ్వ డం చేయగలవు. అపాయింట్‌మెంట్‌ల బుకింగ్‌లు, ఉత్పత్తులను పోల్చడం వంటి సంక్లిష్ట పనులను కూడా చక్కబెట్టగలవు.