ఐజీఎక్స్‌లో 1 శాతం వాటా విక్రయం! | NSE Sells 1 Percent Stake In Indian Gas Exchange To Comply With Regulatory Norm | Sakshi
Sakshi News home page

ఐజీఎక్స్‌లో 1 శాతం వాటా విక్రయం!

Apr 28 2026 2:50 PM | Updated on Apr 28 2026 3:06 PM

NSE Sells 1 Percent Stake In Indian Gas Exchange To Comply With Regulatory Norm

స్టాక్‌ ఎక్స్చేంజీ దిగ్గజం.. ఎన్‌ఎస్‌ఈ తాజాగా ఇండియన్‌ గ్యాస్‌ ఎక్స్చేంజీ(ఐజీఎక్స్‌)లో 1 శాతం వాటా విక్రయించింది. నేచురల్‌ గ్యాస్‌ డెలివరీ ఆధారిత ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐజీఎక్స్‌లో వాటాను నియంత్రణ సంస్థల నిబంధలనమేరకు అమ్మినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఐజీఎక్స్‌లో ఏ ఒక్క సంస్థ 25 శాతానికి మించి వాటాను కలిగి ఉండటాన్ని పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ నియంత్రణ సంస్థ(పీఎన్‌జీఆర్‌బీ) మార్గదర్శకాలు అనుమతించవు. నేచురల్‌ గ్యాస్‌లో స్పాట్, ఫార్వార్డ్, డెలివరీ ఆధారిత కాంట్రాక్టులకు ఐజీఎక్స్‌ నిర్వహించే ఎల్రక్టానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వీలు కల్పించే సంగతి తెలిసిందే. కాగా.. తాజా వాటా విక్రయం తదుపరి ఐజీఎక్స్‌లో ఎన్‌ఎస్‌ఈ వాటా 25 శాతానికి పరిమితమైంది.

2021 మార్చిలో ఎన్‌ఎస్‌ఈ రూ. 19 కోట్లకు ఐజీఎక్స్‌లో 26 శాతం వాటాను సొంతం చేసుకుంది. పీఎన్‌జీఆర్‌బీ నుంచి అనుమతులు పొందడం ద్వారా ఐజీఎక్స్‌కు సహప్రమోటర్‌గా అవతరించింది. దేశీ నేచురల్‌ గ్యాస్‌ ధరల ఆధారంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్‌ డెరివేటివ్స్‌కు తెరతీసేందుకు వీలుగా ఎన్‌ఎస్‌ఈ ఈ నెల మొదట్లో ఐజీఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం విదితమే.

వెరసి ఐజీఎక్స్‌ ప్రామాణిక ధరల ఇండెక్స్‌ జీక్సీ ఆధారంగా గ్యాస్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టులకు శ్రీకారం చుట్టనుంది. ఇక మరోపక్క ఐజీఎక్స్‌ ఈ జనవరిలో పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఐపీవో చేపట్టాలని భావిస్తోంది. 2026 జూన్‌లోగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసే వీలున్నట్లు ఎండీ, సీఈవో రాజేష్‌ కుమార్‌ ఎం. పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement