
ఎన్‌ఎంఏసీసీ ఇండియా వీకెండ్ పేరుతో ఏర్పాట్లు
2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు వేడుకలు
న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్‌లో భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుంది. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు..వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకల నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్ స్వాగత్’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్‌లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్‌కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్‌డేట్స్
అతిథులు బాలీవుడ్ నృత్య వర్క్‌షాప్‌ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్‌ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్‌ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్‌లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది.
ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్, శాస్త్రీయ సంగీతకారుడు రిషబ్ శర్మ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఎడ్డీ స్టెర్నోతో మార్నింగ్ యోగా, క్రికెట్ థీమ్ ప్యానెల్స్, షియామక్ దావర్ నేతృత్వంలో బాలీవుడ్ డ్యాన్స్ వర్క్‌షాప్‌లు ఉంటాయి. ‘సంస్కృతి మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు.