సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి

Nirmala Sitharaman urges auditors to embrace technology - Sakshi

ఆడిటర్లకు సీతారామన్‌ విజ్ఞప్తి

ఇకపై కొత్త ఫార్మాట్‌లో చార్టర్డ్‌ అకౌంటెంట్ల పరీక్షలు

చెన్నై: భారతదేశం అభివృద్ధి చెందిన దేశ హోదా సాధించడానికి రాబోయే 25 ఏళ్లు ‘క్లిష్టమైనవి’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. భారత్‌ వృద్ధిలో ఆడిటర్లు కీలక పాత్ర పోషించాల్సన అవసరం ఉందని పేర్కొన్న ఆమె, ఈ బాటలో వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని, చిన్న కంపెనీలు అభివృద్ధి చెందేలా అవగాహన కలి్పంచాలనివిజ్ఞప్తి చేశారు.

గత 20–25 ఏళ్లలో దేశం అనేక స్థాయిల్లో పురోగమించిందని, 60 ఏళ్లలో సాధించలేనిది గత దశాబ్దంలో భారత్‌ సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్‌సహా పలు నివేదికలు ఇవే విషయాలను చెబుతున్నాయని అన్నారు. ది సోసైటీ ఆఫ్‌ ఆడిటర్స్‌ 90వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి తమిళం– ఇంగ్లీషుల్లో దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన ఆమె  ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...

► నేను ఈ వృత్తిలో (ఆడిటింగ్‌) ఉన్న అనుభవజు్ఞలతో మాట్లాడుతున్నాను. దశాబ్దాల క్రితం రిజిస్టర్‌ అయిన సంస్థలలో మీది ఒకటి.  మీ అందరితో నా సమావేశం కేవలం 90 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి మాత్రమే కాదు. ఈ వృత్తిలో మీరు మరిన్ని బాధ్యతలను స్వీకరించుకోవాల్సిన సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను.  
► ప్రపంచవ్యాప్తంగా చార్టర్డ్‌ అకౌంటెంట్ల విధానాలు చాలా మార్పులకు లోనవుతున్నాయి. ఇక్కడకు వచి్చన ఆడిటర్లలో కొందరు ఇప్పటికే తమ వృత్తిలో నెలకొంటున్న మార్పును గమనించారని నేను భావిస్తున్నాను.  
► ఆడిటింగ్‌ విధానంలో టెక్నాలజీ ఇకపై కీలక భూమికను పోషించనుంది. మీలో చాలా మంది ఈ మార్పును సానుకూలతలో స్వీకరిస్తున్నారు. వచ్చే జూలై నుండి చార్టర్డ్‌ అకౌంటెంట్ల పరీక్షలు కూడా వేరే ఫార్మాట్‌లో ఉండబోతున్నాయి.
► రాబోయే 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కీలకం. మనలో ప్రతి ఒక్కరూ మీ వృత్తిపై దృష్టి పెట్టడమే కాకుండా దేశానికి మెరుగైన సేవలందించే మార్గాలను అందించండలో ముఖ్యమైన పాత్ర పోషించాలి.  
► స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి చాలా మంది న్యాయవాదులు తమ వృత్తిని విడిచిపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజు మీరు మీ వృత్తిని విడిచిపెట్టాలని ఎవరూ కోరుకోరు.  కానీ దేశానికి సేవ చేయడం, దేశ లక్ష్యాల గుర్తింపులో మీరు భాగస్వాములుగా ఉండాలి. మీ వృత్తి కార్యకలాపాల్లో ఇది కూడా ఒక  భాగం కావాలి. ప్రతి ఒక్కరూ ‘కర్తవ్యం’ అనే గొప్ప భావాన్ని కలిగి ఉండాలి. భారత్‌ అభివృద్ధి చెందిన దేశ స్థితికి చేరుకోవడంలో అలాగే దేశం తన గత వైభవాన్ని తిరిగి సాధించడంలో ఉన్న సవాళ్లను ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ఉండాలి.
► 1947కు ముందు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఇళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. అలాంటి అవసరం ఈ రోజు తలెత్తబోదు. ప్రతి వృత్తిలోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ.. తద్వారా దీనిని దేశాభివృద్ధికి మిళితం చేయడానికి తగిన కృషి సల్పాలి.  
► ఉదాహరణకు, మీరు ఈ రంగంలో మీ పెట్టుబడులను కేటాయించినట్లయితే, మీరు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారని, అది దేశానికి మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుందని మీరు మీ ఖాతాదారులకు సలహా ఇవ్వవచ్చు. ఇలాంటి సూచనలు ఇవ్వడం ద్వారా మీరు దేశాభివృద్ధికి తోడ్పడగలరు.  
► ప్రభుత్వం ఎక్కడ డబ్బు కోల్పోతున్నారో సంబంధిత అధికారులకు తెలియజేయడం ద్వారా ఆడిటర్లు దేశ పురోగతిలో భాగం పంచుకోవాలి.  
► మీరు కంపెనీ పేరు లేదా దానిలో ప్రమేయం ఉన్న వ్యక్తి పేరు చెప్పనవసరం లేదు. ఇది మీ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. కానీ పన్ను ఏ రూపంలో ఎగవేత జరుగుతోందో మాత్రం మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top