మెటాలో ఆగని కొలువుల కోత.. ఈసారి ఎందరంటే.. | Meta Layoffs 200 Jobs Cut Amid 135Billion USD AI Push | Sakshi
Sakshi News home page

మెటాలో ఆగని కొలువుల కోత.. ఈసారి ఎందరంటే..

Apr 4 2026 2:52 PM | Updated on Apr 4 2026 3:50 PM

Meta Layoffs 200 Jobs Cut Amid 135Billion USD AI Push

సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి పెద్దపీట వేస్తూ కంపెనీలో భారీ పునర్నిర్మాణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కాలిఫోర్నియాలో సుమారు 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ మేరకు కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌(ఈడీడీ)కు మెటా అధికారిక నివేదికలను సమర్పించింది.

కాలిఫోర్నియా విభాగంలో జరుగుతున్న ఈ మార్పుల వల్ల బర్లింగేమ్, సన్నీవేల్ కార్యాలయాల్లోని సిబ్బంది ప్రభావితం కానున్నారు. బర్లింగేమ్‌లో 124 ఉద్యోగాల తొలగింపు, సన్నీవేల్ 74 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ చెప్పింది. ఈ నిర్ణయం మే నెలాఖరు నుంచి అమలులోకి రానుంది. ఈ లేఆఫ్స్ శాశ్వత ప్రాతిపదికన ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి మెటాలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. జనవరి 2026లో మెటావర్స్ ప్రాజెక్ట్ రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో దాదాపు 1,500 మందిని తొలగించారు. మార్చి 2026లో రిక్రూట్‌మెంట్, సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో సుమారు 700 మందిపై వేటు పడింది. తాజాగా కాలిఫోర్నియా రీజియన్‌లో మరో 200 మందికి ఉద్వాసన పలికారు.

ఏఐ పెట్టుబడులే ప్రధాన కారణం

ఈ ఏడాది ఏఐ మౌలిక సదుపాయాల (డేటా సెంటర్లు, సర్వర్లు) కోసం మెటా దాదాపు 115 బిలియన్‌ డాలర్ల నుంచి 135 బిలియన్‌ డాలర్ల మధ్య మూలధన వ్యయాన్ని అంచనా వేసింది. సాధారణ పనుల కోసం మానవ వనరుల కంటే ఏఐ సాధనాలపైనే కంపెనీ ఎక్కువగా ఆధారపడుతోంది. ఒకవైపు తొలగింపులు జరుగుతున్నప్పటికీ హై-లెవల్ టెక్నికల్ ఏఐ ఉద్యోగాల కోసం కంపెనీ కొత్త నియామకాలను చేపడుతోంది.

ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా?

Advertisement
 
Advertisement
Advertisement