MBA Chai Wala: టీ బిజినెస్‌తో కోట్లు, ఇపుడు మళ్లీ వార్తల్లోకి..విషయం ఏమిటంటే..!

Mba chai wala prafull billore buys expensive mercedes benz - Sakshi

సాక్షి, ముంబై: కష్టపడి పనిచేసేవారు బాగుపడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అది ఏ రంగంలో అయినా కావచ్చు, నీకున్న నిబద్దత నిన్ను తప్పకుండా గొప్పవాడిగా ఎదిగేలా చేస్తుంది అనటానికి 'ప్రఫుల్ బిల్లోర్' అలియాస్ 'MBA చాయ్ వాలా' మంచి ఉదాహరణ. 

ప్రఫుల్ బిల్లోర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ 'ఎంబీయే చాయ్ వాలా' అంటే మాత్రం ఎక్కువ మందికి తెలుసు. MBA మధ్యలోనే ఆపేసి IIM అహ్మదాబాద్ వెలుపల ఎనిమిది వేల రూపాయలతో టీ స్టాల్ ప్రారంభించి ఈ రోజు రూ. 90 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు. 

అసలు  ఎవరీ MBA చాయ్ వాలా 
మధ్యప్రదేశ్‌లో బీకామ్‌ పూర్తి చేసిన 'ప్రఫుల్ బిల్లోర్' ఎంబీఏ చేయాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ మంచి ర్యాంక్ రాకపోవడంతో  ఉపాధికోసం అంట్లు తోమే పనిలో చేరాడు.  సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే పట్టుదల అతణ్ణి నిద్ర పోనీయలేదు. అంతే...తాను ఎంబీఏ చేయాలనుకున్న క్యాంపస్ పక్కెనే టీ స్టాల్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ కోట్ల బిజినెస్‌ను  సాధించాడు.  తనలాంటివారికి  ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచాడు. అలా చిన్న టీ స్టాల్ తో ప్రారంభమైన ప్రఫుల్  దేశవ్యాప్తంగా ‘ఎంబీయే చాయ్ వాలా’ పేరుతో పాపులర్‌ అయ్యాడు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధిస్తున్నాడు. అంతేకాదు ఎంబీఏ చాయ్‌వాలా అకాడమీని ప్రారంభించి ఆంట్రప్రెన్యూర్‌షిప్‌లో స్పెషల్‌ కోర్స్‌ అందిస్తూ.. పెద్ద పెద్ద కాలేజీల్లో స్టూడెంట్స్‌కి సైతం క్లాసులు కూడా చెబుతున్నాడు.  అలాగే మోటివేషనల్ స్పీకర్‌గా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

తాజాగా అతను ఖరీదైన బెంజ్‌ కారు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. కేవలం ఎనిమిది వేలతో ప్రారంభమైన ప్రఫుల్ ప్రయాణం ఈ రోజు మెర్సిడెస్ బెంజ్ GLE 300డి కొనుగోలు చేసే స్థాయికి చేరింది. GLE 300d అనేది బ్రాండ్ హై-ఎండ్ మోడల్,  ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.  ఈ కారులోని 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 245 పిఎస్ పవర్ & 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగాన్ని అందుకుంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top