మారుతీ క్యూ4 రికార్డులు | Maruti Suzuki Q4 net profit fell 6. 5 percent to Rs 3659 crore | Sakshi
Sakshi News home page

మారుతీ క్యూ4 రికార్డులు

Apr 29 2026 2:31 AM | Updated on Apr 29 2026 2:31 AM

Maruti Suzuki Q4 net profit fell 6. 5 percent to Rs 3659 crore

వాహన విక్రయాలు: 6,76,209  

షేరుకి రూ. 140 డివిడెండ్‌ 

రూ. 50,000 కోట్లు దాటిన ఆదాయం  

నికర లాభం మాత్రం 6 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 6 శాతం నీరసించి రూ. 3,659 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 3,911 కోట్లు ఆర్జించింది. అయితే వాహన విక్రయాలు 12 శాతం ఎగసి 6,76,209 యూనిట్లను తాకాయి. ఒక త్రైమాసికంలో ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. దేశీ అమ్మకాలు 5,38,994 యూనిట్లను తాకగా, ఎగుమతులు రికార్డ్‌ సృష్టిస్తూ 1,37,215 యూనిట్లకు చేరాయి.

మార్క్‌టు మార్కెట్‌(ఎంటూఎం)తోపాటు.. నిర్వహణేతర ఆదాయం తగ్గడం, బాండ్‌ ఈల్డ్స్‌లో మార్పు కారణంగా నష్టం నమోదు చేయడం(తదుపరి దశలో రికవరీకి వీలుంది) ఈ క్యూ4 లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ పేర్కొంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 140 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. ఇది అత్యధికంకాగా 2024–25లో రూ. 135 డివిడెండ్‌ చెల్లించింది. మొత్తం ఆదాయం మాత్రం 28 శాతం ఎగసి రూ. 52,462 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 40,920 కోట్ల టర్నోవర్‌ మాత్రమే అందుకుంది. వెరసి కంపెనీ చరిత్రలోనే తొలిసారి ఒక క్వార్టర్‌లో రూ. 50,000 కోట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 37,556 కోట్ల నుంచి రూ. 48,125 కోట్లకు పెరిగాయి.  

పూర్తి ఏడాదికి 
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతీ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 14,680 కోట్లకు చేరింది. 2024–25లో రూ. 14,500 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,52,913 కోట్ల నుంచి రూ. 1,83,316 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం వాహన అమ్మకాలు 22,34,266 యూనిట్ల నుంచి 24,22,713 యూనిట్లకు బలపడ్డాయి. దేశీయంగా 19,74,939 యూనిట్ల అమ్మకాలు సాధించగా.. 4,47,774 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది ద్వితీయార్ధంలో జీఎస్‌టీ రేట్ల సవరణల కారణంగా దేశీ మార్కెట్లో అమ్మకాలు పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏడాది చివరికల్లా  1.9 లక్షల పెండింగ్‌ ఆర్డర్లు  నమోదైనట్లు వెల్లడించింది. 
ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్‌ఈలో 2.5% క్షీణించి రూ. 12,892 వద్ద ముగిసింది.

ఇక పెట్టుబడుల జోరు..
సామర్థ్య విస్తరణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో మారుతీ సుజుకీ రూ. 14,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఖార్ఖోడా(హరియాణా), హన్సల్‌పూర్‌ (గుజరాత్‌)లో రెండు లైన్లను జత చేయనున్నట్లు కంపెనీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. ప్రస్తుత ప్లాంట్ల సామర్థ్య వినియోగం 100 శాతానికి చేరిన నేపథ్యంలో కొత్తగా 5 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని జత చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా చిన్న కార్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియ జేశారు.

Advertisement
 
Advertisement
Advertisement