హైదరాబాద్‌లో ఒకే రోజు 108 ఈ-విటారా కార్లు డెలివరీ | Maruti Suzuki Plans Four More EVs by 2031 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఒకే రోజు 108 ఈ-విటారా కార్లు డెలివరీ

Apr 12 2026 7:41 AM | Updated on Apr 12 2026 8:02 AM

Maruti Suzuki Plans Four More EVs by 2031

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా 2031 నాటికి మరో 4 ఎలక్ట్రిక్‌ కార్లను ప్రవేశపెట్టనుంది. అప్పటికి బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహన (బీఈవీ) విభాగంలో అగ్రస్థానానికి చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్, సేల్స్‌) పార్థో బెనర్జీ తెలిపారు. హైదరాబాద్‌లో ఒకే రోజున 108 ఈ–విటారా వాహనాలను డెలివరీ చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.

కమోడిటీల ధరలు పెరిగిన నేపథ్యంలో తమ కార్ల రేట్లను పెంచే యోచనలో ఉన్నట్లు వివరించారు. అయితే, పెంపు పరిమాణం ఎంత, ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. 44 దేశాలకు 25,000 పైచిలుకు ఈ–విటారా వాహనాలను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. ఎగుమతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలను ఇంకా మదింపు చేయాల్సి ఉందన్నారు. దేశీయంగా హైదరాబాద్‌లో అత్యధికంగా 14.5 శాతం స్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఉంటోందని ఆయన చెప్పారు.

తెలంగాణవ్యాప్తంగా 256 చార్జింగ్‌ పాయింట్లు ఉన్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 5 కి.మీ.కి ఒకటి చొప్పున 119 ఉన్నాయని వివరించారు. కస్టమర్లలో ముందుగా రేంజిపరమైన ఆందోళన తొలగించేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాకే విద్యుత్‌ వాహనాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రిక్‌ కార్‌ ఆవిష్కరణలో కొంత జాప్యం జరిగినట్లు పార్థో బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,000కు పైగా ఎక్స్‌క్లూజివ్‌ చార్జింగ్‌ పాయింట్లు ఉండగా 2030 నాటికి లక్షకు పైగా పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్ల నెట్వర్క్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement