మార్కెట్లు అక్కడక్కడే- చిన్న షేర్ల హవా | Sakshi
Sakshi News home page

మార్కెట్లు ఫ్లాట్- చిన్న షేర్ల హవా

Published Fri, Aug 7 2020 4:01 PM

Market ends flat in choppy session- Mid caps zoom - Sakshi

ఆద్యంతం స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ముగిశాయి. సెన్సెక్స్‌ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 38,040 వద్ద నిలవగా.. నిఫ్టీ 14 పాయింట్లు బలపడి 11,214 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,110 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,787 వద్ద కనిష్టాన్ని చేరింది. ఇదే విధంగా నిఫ్టీ 11,232- 11,142 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం, ట్రేడర్ల లాభాల స్వీకరణ, వారాంతం కావడం వంటి అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ఐటీ, ఫార్మా డౌన్
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగాలు 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఐటీ 1 శాతం, ఫార్మా 0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఫిన్‌, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, బ్రిటానియా, టాటా మోటార్స్‌, మారుతీ 5-2 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, విప్రొ, అల్ట్రాటెక్‌, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌ 2.5-0.5 శాతం మధ్య క్షీణించాయి.

ఆర్‌బీఎల్‌ జోరు
డెరివేటివ్స్‌లో ఆర్‌బీఎల్ బ్యాంక్‌ 9.3 శాతం దూసుకెళ్లగా.. ఐడియా, టాటా కన్జూమర్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, అపోలో టైర్‌, సెంచురీ టెక్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, బీవోబీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, మణప్పురం, ఫెడరల్‌ బ్యాంక్‌ 7-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. లుపిన్‌, పేజ్‌, బయోకాన్‌, నిట్‌ టెక్‌, ఎంజీఎల్‌, గ్లెన్‌మార్క్‌, వోల్టాస్‌, అంబుజా, టొరంట్‌ ఫార్మా 6-1.3 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5-0.8 శాతం మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,666 లాభపడగా.. 1,039 నష్టపోయాయి. 

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 637 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 468 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 60 కోట్లు, డీఐఐలు రూ. 426 కోట్ల చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 704 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 666 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. 

Advertisement
Advertisement